శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (16:04 IST)

విజయనిర్మల గారి లాంటి ప్రతిభావంతురాలిని ఇక చూడ‌లేం : మెగాస్టార్ (video)

అరుదైన ద‌ర్శ‌క న‌టీమ‌ణి శ్రీమ‌తి విజ‌య నిర్మ‌ల గారి హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... "మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల.
 
అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్‌కి  ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 
 
మనసున్న మనిషి, లెజెండ్ విజయనిర్మల గారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్ 
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమ పై చెరగని ముద్ర వేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్న విజయనిర్మల గారు తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని జీవితా రాజశేఖర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆమె అన్నారు. 
 
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ... "మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మల గారు. ఎంతో మందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'మీనా' నాకు చాలా ఇష్టం.
 
అది పక్కన పెడితే... 'దేవుడే గెలిచాడు' అని ఒక దెయ్యం సినిమా తీశారు. నా చిన్నప్పుడు వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే, ఆవిడ నటించిన 'అల్లూరి సీతారామరాజు' నాకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. రీసెంట్‌గా కృష్ణ గారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్‌లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది  పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. 
 
ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. విజయనిర్మల గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇప్పుడు కృష్ణ గారి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆవిణ్ణి ఎక్కువగా మిస్ అయ్యే వ్యక్తి ఆయనే. ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఒకరిని మరొకరు వదలకుండా అండ‌ర్‌స్టాండింగ్‌తో కృష్ణ, విజయనిర్మల దంపతులు ఉండేవారు. ఇద్దరి దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తి. కృష్ణగారికి, నరేష్ కి భగవంతుడు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
 
విజ‌య‌నిర్మల గారి మృతి చిత్ర‌సీమ‌కు తీర‌ని లోటు - నంద‌మూరి బాల‌కృష్ణ‌
న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల‌గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. నాన్న‌గారి `పాండురంగ మ‌హ‌త్యం` సినిమాలో కృష్ణుడిగా న‌టించారు. అదే ఆవిడ న‌టించిన తొలి తెలుగు సినిమా. 
 
బాలన‌టి నుండి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. నాన్న‌గారితో మారిన మ‌నిషి, పెత్తందార్లు, నిండుదంప‌తులు, విచిత్ర‌కుటుంబం సినిమాల్లో న‌టించారు. అలాగే ద‌ర్శ‌కురాలిగా 44 చిత్రాల‌ను డైరెక్ట్ చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.