బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జులై 2024 (19:28 IST)

న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‍లో రైతు పొర్లుదండాలు... (Video)

farmer
కలెక్టరేట్‌లో ఓ రైతు పొర్లు దండాలు పెట్టారు. నకిలీ పత్రాలతో తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఓ రైతు అధికారులను ఆశ్రయించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురై నిరసనగా కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక దృశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
 
మాంద్‌సౌర్‌ ప్రాంతానికి చెందిన రైతు శంకర్‌లాల్‌ పాటిదార్‌కు తన స్వగ్రామంలో 9 బిగాల వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఇందులో కొంత భూమిని కలెక్టర్‌ ఆఫీసులో పనిచేసే బాబు దేశ్‌ముఖ్‌ అనే అధికారి అక్రమంగా కబ్జా చేసుకున్నారని శంకర్‌లాల్‌ ఆరోపించారు. స్థానిక మాఫియా, గూండాల సాయంతో బలవంతంగా తమ భూమిని దేశ్‌ముఖ్‌ 2010లో తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిపారు.
 
అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆ రైతు చెప్పారు. అసలైన ధ్రువపత్రాలతో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళవారం కూడా మరోసారి కలెక్టర్‌ ఆఫీసుకురాగా.. అధికారుల నుంచి స్పందన లభించలేదు. దీంతో చేసేదేం లేక ఆఫీసు ప్రాంగణంలో చేతులు జోడించి.. ఏడుస్తూ పొర్లుదండాలు పెట్టారు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్‌ దిలీప్‌ యాదవ్‌ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని, సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.