తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి
తమిళనాడు రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరగడం కలవరానికి గురిచేస్తోంది. ఇటీవలే టీవీకే విజయ్ చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. మంగళవారం నాడు ఎన్నూరులో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకున్నది. ఎన్నూరు పవర్ ప్లాంట్ నిర్మాణంలో వున్న కట్టడం కూలి 9 మంది కార్మికులు మృతి చెందారు. మరో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. నిర్మాణం చేస్తున్న భవనంలో మొత్తం 30 మంది కూలీలు వున్నట్లు సమాచారం. దీన్నిబట్టి మరో ఆరుగురి ఆచూకి తెలియాల్సి వుంది.
తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ ఏమన్నారంటే?
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలోని జరిగిన టీవీకే పార్టీ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ మంగళవారం ఓ వీడియో ద్వారా స్పందించారు. జీవితంలో అలాంటి ఘటనను ఎన్నడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమవైపు ఎలాంటి తప్పు లేకపోయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు.
నా జీవితంలో ఇలాంటి బాధ ఎన్నడూ పడలేదు. నా హృదయం బాధతో విలవిల్లాడుతోంది. ప్రచారంలో నన్ను చూసేందుకు జనం వచ్చారు. నాపై వారు చూపుతున్న ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అలాగే వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు సురక్షితమైన ప్రాంతంలో సభ జరగాలనే నేను కోరుకున్నాను. అదే విషయమై పోలీసు శాఖను అభ్యర్థించాను. కానీ జరగకూడనిది జరిగింది.
అంతకుముందు మేం ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాం. కానీ ఒక్క కరూర్‌లోనే ఎందుకు ఇలా జరిగింది. ప్రజలకు నిజం తెలుసు. వారంతా చూస్తున్నారు. నేను కూడా మనిషినే. ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందనే నేను అక్కడ పర్యటించలేదు. త్వరలోనే వారిని కలుస్తా. కరూర్ ప్రజలు నిజాలు మాట్లాడినప్పుడు దేవుడే అలా మాట్లాడిస్తున్నట్లు అనిపించింది. తర్వలో అన్ని నిజాలు బయటకువస్తాయి. మేం ఎలాంటి తప్పులు చేయకపోయినా.. పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు అని తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.