బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 మే 2020 (21:07 IST)

ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో కేసీఆర్‌ వాడిన భాష సరిగా లేదని ఆక్షేపించారు. సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం- ఒకే గ్రిడ్‌ విధానం అమలు కావాల్సిందేనన్నారు.

తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదన్నారు. దేశ హితం కోసం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గత విధానాల్లో మార్పుల కోసమే అనేక సంస్కరణలు చేపట్టామన్నారు.

పరిశ్రమల స్థాపన... నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే మరో 70 ఏళ్లయినా దేశం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేసీఆర్ వివరించాలన్నారు. ‘తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని చెబుతున్నారు. సంస్కరణలు, గిట్టుబాటు ధరల కోసం అలా చేశారేమో?. 
 
రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామా? మీరు చేసింది సరైనప్పుడు.. కేంద్రం చేసింది ఎందుకు సరికాదు.  రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారు. తెలంగాణ నుంచి పొట్టచేతబట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్తున్నారు. వలస కార్మికుల సమస్య 30-40 ఏళ్ల నుంచి ఉంది. రాష్ట్రాల నుంచి వలసలు వెళ్లకుండా మార్పు జరగకూడదా?

పాలనా సంస్కరణలు.. విదేశీ పెట్టుబడులు రాకపోతే ఎలా? దేశ ప్రధానిని విమర్శించుకోవడం మంచిదా?. ఉపాధి హామీపథకానికి రూ.1.01లక్షల కోట్లు సిద్ధంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 3 కోట్ల మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఇస్తున్నాం. ప్యాకేజీలో భాగంగా తెలంగాణలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు రావా? మద్ర రుణాల ద్వారా చిన్న వ్యాపారులకు రుణాలు దొరకవా?

ప్యాకేజీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు లబ్ధి జరుగుతుంది. ప్యాకేజీ కింద ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే బోగస్‌ అంటారా? ప్రపంచ విపత్తు దృష్ట్యా మన కాళ్లపై మనమే నిలబడాలి. స్థానిక వనరులు, అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి. సేవారంగం, ఉత్పత్తులు, మౌలిక వసతులు మనమే పెంచుకోవాలి’’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.