బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 6 మే 2020 (20:46 IST)

తెలంగాణలో బారులు తీరిన మద్య‌పాన ప్రియులు

లాక్‌డౌన్ అమ‌లు కారణంగా దాదాపు నెల‌న్న‌ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.

కంటైన్మెంట్ ప్రాంతాలు మిన‌హా ‌రెడ్‌జోన్‌లు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బుధ‌వారం ఉదయం 10 గంటల నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. మద్యం కోసం ఉదయం 8గంటల నుంచే మందుబాబులు షాపుల ముందు బారులు తీరారు.

ఆబ్కారీ శాఖ ఆదేశాల మేరకు చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, మిగిలిన అన్ని బ్రాండ్లపై 16 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. కంటైన్మెంట్  ప్రాంతాల్లో మాత్రం మద్యం దుకాణాలు మూసే ఉంటాయని అధికారులు తెలిపారు.

మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే ఆ క్షణమే సదరు దుకాణం లైసెన్సు రద్దుచేస్తామని స్పష్టం చేశారు.

మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరచి ఉంచుతారు. ప్రజలు క్రమశిక్షణతో, ఎడం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని,  మాస్కులు ధరించకపోతే మద్యం అమ్మవద్దని, దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులు ఇప్ప‌టికే సూచనలు జారీ చేశారు.