గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:49 IST)

తెలంగాణకు గుడుంబా ముప్పు!

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేశారు. అయినా పట్టణ ప్రాంతాల్లో ఎలాగోలా మందు లభ్యమవుతుండగా, పల్లెల్లో సరుకు దొరకట్లేదు. దీంతో అనివార్యంగా మళ్లీ గ్రామాల్లోని ప్రజలు గుడుంబా వైపు చూస్తున్నట్టు ఎక్సైజ్‌ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 26 వరకు 1,600 గుడుంబా కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,019 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా, 1.15 లక్షల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 20వేల లీటర్లు, వరంగల్‌లో 17వేలు, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 15వేల చొప్పున, రంగారెడ్డిలో 8వేలు, నల్లగొండలో 7వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ గుడుంబా కేసులు నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో మళ్లీ గుడుంబా గుప్పుమనడానికి చాలా కారణాలున్నాయి. మద్యం అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం కాగా, లాక్‌డౌన్‌ సమయలో పనుల్లేకపోవడం మరో కారణమని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు. గుడుంబాను నిర్మూలించగలిగాం కానీ గుడుంబా కాసే పద్ధతులు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మర్చిపోలేదని వారు చెబుతున్నారు.