గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (09:23 IST)

కరోనావైరస్: మాస్కు ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి?

కోవిడ్-19 అనేది ఒక శ్వాసకోశ వ్యాధి. దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కు, నోటి ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ వ్యాధి అనేక మందికి వ్యాపిస్తుంది. కోవిడ్ పై పోరాడి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఉత్తమమైన, అనుకూలమైన ఆయుధం మాస్కును ధరించడం. 
 
మాస్కు కూడా సరైన సమయంలో సరైన విధంగా ధరించడం అవసరం. గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన కొత్త అలవాటు, జపించాల్సిన కొత్త మంత్రం 'మాస్కే కవచం'. 
 
మాస్కు ఎందుకు ధరించాలి?
కోవిడ్-19 వైరస్ అప్రమత్తంగా లేని ఎవరి మీదైనా దాడి చేయవచ్చు. ఈ వైరస్ మన స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులు లేదా అపరిచితులు ఇలా ఎవరి దగ్గర నుండైనా రావచ్చు. మాస్కు వేసుకోకుండా బయటకు వెళ్లడం అంటే కరోనా వైరస్ ను ఇంటికి ఆహ్వానించడమే 
 
ఇంటి గడప దాటి బయటకు వెళ్లిన ప్రతిఒక్కరూ మాస్కు సరిగా వేసుకుంటే కోవిడ్ వ్యాప్తిని మనం చాలా వరకు ఆపవచ్చు. ప్రస్తుతం ఇదే మన ముందున్న ఉత్తమమైన ప్రత్యామ్నాయం. 
 
మాస్కు వాడడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని, సంక్రమణను రెండు రకాలుగా అడ్డుకోవచ్చు. మొదటగా ఎవరిలోనైనా కరోనా వైరస్ ఉంటే వారి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తించకుండా మాస్కు ఆపుతుంది. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే కొందరిలో ఎటువంటి వైరస్ లక్షణాలు కనిపించకపోయినా సరే వారి ద్వారా కరోనా వైరస్ వ్యాపించగలదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాస్కు వేసుకుంటే కోవిడ్ వైరస్ తనకు సోకకుండా మాస్కు రక్షణనిస్తుంది.
 
మాస్కు ఎప్పుడు ఉపయోగించాలి?
కేవలం మనకు నచ్చినపుడు మాత్రమే మాస్కు వేసుకోవడం సరిపోదు. మనం అజాగ్రత్తగా ఉన్న ఒక్క సందర్బం చాలు మనం వైరస్ బారిన పడడానికి. కాబట్టి ఈ క్రింది సందర్భాలలో మాస్కు విధిగా ధరించడం మర్చిపోవద్దు. 
 
1. ఇంటి బయటకు వెళ్లినపుడు:
* రద్దీగా ఉన్న ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు
* స్నేహితులు, బంధువులను సరదాగా కలిసినపుడు
* ప్రార్థనా స్థలాలు, బజారులో
* ఆసుపత్రుల దగ్గరకు వెళ్లినపుడు
* పనిచేసే ప్రాంతంలో, తోటి ఉద్యోగులతో ఉన్నపుడు
* బ్యాంకు, పోస్టాఫీసు వంటి చోట్ల
 
2. ఇంట్లో ఉన్నా సరే, ఒకవేళ జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నపుడు 
 
3. ఇంట్లోనే ఎవరైనా కుటుంబ సభ్యులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నపుడు
 
4. ఎవరైనా కోవిడ్ సోకిన వ్యక్తిని గానీ, ఆ లక్షణాలు ఉన్నవారిని కలిసినపుడు
 
5. కోవిడ్ బారినపడిన వ్యక్తి గానీ, ఆ లక్షణాలు ఉన్నవారికి గానీ సంరక్షణ అందించవలసి వచ్చినపుడు
 
ఎలాంటి మాస్కు వేసుకోవాలి?
సాధారణ ప్రజలు నాణ్యమైన వస్త్రంతో తయారు చేసిన మూడు పొరల మాస్కును ధరించడం అనుకూలంగా ఉంటుంది. కోవిడ్-19 సోకినవారు మరియు వారి సంరక్షకులకు మాత్రం ఎన్-95 లేదా ఎన్-99 వంటి ప్రత్యేక మాస్కుల అవసరం ఉంటుంది. 
 
* కోవిడ్ నుంచి రక్షణ కోసం మూడు పొరలతో ఉన్న నాణ్యమైన దళసరి (ఎక్కువ దారంతో దగ్గరగా అల్లిన/నేసిన) కాటన్ వస్త్రంతో చేసిన మాస్కు ఉపయోగించడం మంచిది. బయటి పొర నైలాన్ లేదా పాలిస్టర్ వస్త్రం, లోపలి పొర గాలి పీల్చుకునే స్వభావం ఉన్న కాటన్ అయితే మంచిది. 
 
* అయితే, ఆ మాస్కు నోరు మరియు ముక్కును పూర్తిగా కప్పేలా, ముఖానికి మరియు మాస్కుకి మధ్యలో ఖాళీ లేకుండా సరిపోయేలా ఉండాలి.
 
* సింథటిక్ లేదా పలుచటి వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ఉపయోగించవచ్చు. 
 
* వాల్వ్ లేదా కవాటాలు ఉన్న మాస్కులు సాధారణ ప్రజలకు అవసరం లేదు. 
 
మాస్కు ఎలా ధరించాలి?
మాస్కు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అది సరిగ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే కలుగుతాయి. మాస్కు వేసుకునేటప్పుడు, తీసివేసేటప్పుడు వీటిని తప్పనిసరిగా పాటించండి  
 
* మాస్కు వేసుకునే ముందు, తీసివేసిన తర్వాత, ప్రతిసారి తప్పనిసరిగా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి  
 
* మాస్కుపై ఉన్న మడతలు బయటకు కనిపించాలి. కిందికి ఉండాలి  
 
* తాళ్లు ఉన్న మాస్కు అయితే మొదట పైతాళ్లు ఆ తర్వాత కింది తాళ్లు ముడి వేయాలి. తీసేటప్పుడు మాత్రం మొదటి కొంది తాళ్లు ఆ తర్వాత పై తాళ్లు విప్పాలి 
 
* రింగులు ఉన్న మాస్కు అయితే, రింగులు ఉపయోగిస్తూ  వేసుకోవాలి, తియ్యాలి  
 
* మీరు వేసుకున్న మాస్కు నోటిని, ముక్కును పూర్తిగా కప్పాలి  
 
* మాస్కుపై భాగాన్ని పదేపదే తాకకూడదు 
 
* మాస్కు తీసిన తర్వాత మీ కంటిని, నోటిని, ముక్కును తాకరాదు 
 
* మీ మాస్కు ఇతరులతో పంచుకోవద్దు. ఇతరుల మాస్కు మీరు వాడొద్దు  
 
* వదులుగా ఉన్న మాస్కు వేసుకోవద్దు 
* మాస్కు తేమ లేదా తడిగా అయితే వెంటనే మార్చాలి
 
* మాస్కును చెత్తలో పారవేసే ముందు సబ్బు, బ్లీచింగ్ లేదా డెటాల్ తో శుభ్రం చేయాలి.
 
మాస్కు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 
మాస్కు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ కు దారి తీసే అవకాశం ఉంది. ఈ కింది వాటిని పాటించండి.
 
* ఉతికి, శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మాస్కును ప్రత్యేకమైన స్థలంలో భద్రపరచాలి
 
* వస్త్రంతో చేసిన మాస్కును వాడిన తర్వాత, ప్రతిసారి సబ్బు మరియు నీటితో శుభ్రం చేయాలి
 
* మళ్లీ వాడగలిగే ( రీ యూజబుల్) మాస్కు ఆరు నుంచి ఎనిమిది గంటలలోపు శుభ్రం చేయాలి. ఒకవేళ ఈ లోపే తడిచిపోయినా, మురికి పట్టినా సరే మార్చాలి
* ఒక్కసారి మాత్రమే వాడి పారవేసే (డిస్పోజబుల్) మాస్కు కూడా ఎనిమిది గంటలలోపు తీసేయాలి. ఒకవేళ ఈ లోపే తడిచిపోయినా, మురికి పట్టినా సరే మార్చాలి 
 
* మాస్కు వాడనప్పుడు, ఇంట్లోనే ఎంచుకున్న ప్రదేశంలో ఒక కవర్లో లేదా బ్యాగ్ లో మాస్కును సురక్షితంగా ఉంచాలి 
 
మాస్కును సురక్షితంగా పారవేయడం ఎలా?
ఒక్కసారి మాత్రమే వాడి పారవేసే(డిస్పోజబుల్) మాస్కును సురక్షితంగా పారవేయడం చాలా ముఖ్యం. లేకపోతే ఆ మాస్కు ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉంది.
* తీసేసిన మాస్కును పారవేసే ముందు 72 గంటలు లేదా మూడు రోజులు ఒక మూసిన కవర్ లో ఉంచాలి. 
* మూడు రోజుల తరువాత ఇతర చెత్తతో పాటు ఆ కవర్ పారవేయండి.
 
ఇవి మర్చిపోవద్దు!
 
భౌతికదూరం
ఇతరుల నుంచి కరోనా రాకుండా ఉండాలంటే మాస్కు వేసుకున్నపుడు కూడా రెండు గజాలు లేదా ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యం మాస్కు వాడుతూ, చేతుల శుభ్రత పాటిస్తూ రెండు గజాల భౌతిక దూరం పాటించినప్పుడు మాత్రమే సరైన ఫలితం ఇస్తుంది.
 
చేతుల పరిశుభ్రత
చేతుల పరిశుభ్రత, అందరూ పాటించవలసిన మరొక ప్రముఖమైన నివారణ మార్గం. ఈ సందర్భాలలో తప్పనిసరిగా కనీసం 20 సెకన్ల పాటు చేతులు సబ్బు మరియు నీటితో తరచుగా శుభ్రం చేసుకోవాలి.
* బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే
* మాస్కు వేసుకొనే ముందు, తీసేసిన తర్వాత
* మాస్కును సురక్షితంగా పారవేసిన తర్వాత
పైన సూచించిన విషయాలను తప్పక పాటించండి. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.