గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (11:30 IST)

బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య!

బీమా సొమ్ముకు ఆశపడిన భార్య... ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ దారుణం మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాతూర్ జిల్లా బాభల్ గావ్ గ్రామానికి సమీపంలో 2012వ సంవత్సరంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నారావు బాన్సోడ్ అనే వ్యక్తి మరణించాడు. దీంతో స్థానిక పోలీసులు రోడ్డు ప్రమాద మృతి కేసుగా నమోదు చేసి, కేసును మూసివేశారు. 
 
అయితే, ఘటనా స్థలాన్ని సందర్శించిన బీమా సంస్థ ప్రమాదంపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తపై ఉన్న కోటిరూపాయల బీమా డబ్బు పొందడం కోసం అతని భార్య జ్యోతి బాన్సోడ్, బీమా ఏజెంటు రమేష్ వివేకి, అతని స్నేహితుడు గోవింద్ సుబోధిలు కలిసి కుట్రపన్ని హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బీమా డబ్బు కోసమే అన్నారావును చంపారని తేలడంతో జిల్లా ఎస్పీ నిఖిల్ పింగాలే ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి జ్యోతిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బీమా ఏజెంట్, అతని స్నేహితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.