గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 నవంబరు 2025 (11:52 IST)

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

woman dancer
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లి వేడుక కోసం ఓ రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మహిళా డ్యాన్సర్ పట్ల వరుడు బంధువు ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని ఆ డ్యాన్సర్ అడ్డుకుంది. దీంతో ఆగ్రహంచిన వరుడు బంధువులు ఆ డ్యాన్సర్‌పై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 16న హర్యానా రాష్ట్రంలోని నూహ్ జిల్లా పచ్‌గావ్ గ్రామంలో ఒక ప్రీ-వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో కొందరు కళాకారులు నృత్య ప్రదర్శన ఇస్తున్నారు. ఈ క్రమంలో వరుడి బంధువు ఒకరు డబ్బులు ఇస్తున్నట్లు నటిస్తూ ఒక డ్యాన్సర్ వద్దకు అసభ్యకరంగా చేతులు తీసుకురావడంతో, ఆమె అతని చేతిని పక్కకు నెట్టింది. దీనిని అవమానంగా భావించిన ఆ వ్యక్తి వెంటనే ఆమెపై చేయి చేసుకున్నాడు.
 
ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు స్టేజ్‌పైకి దూసుకొచ్చి ఆ డ్యాన్సర్‌ను కిందపడేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. రక్షించడానికి ప్రయత్నించిన తోటి కళాకారులపై కూడా దాడి చేశారు. చివరికి, వారి బృందంలోని సభ్యులు, అక్కడున్న కొందరు మహిళలు జోక్యం చేసుకుని వారిని సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
 
ఈ దాడి ఘటనపై పలువురు కళాకారులు తీవ్రంగా స్పందించారు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న డ్యాన్సర్‌ను అభినందిస్తూ తమ వృత్తిలో ఇలాంటి అవమానాలు సర్వసాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ కళాకారులను కించపరచవద్దు. వారు కూడా ఎవరో ఒకరి సోదరీమణులు, కుమార్తెలే" అని నూహు చెందిన డ్యాన్సర్ బిల్లి అన్నారు. పొట్టకూటి కోసం తాము ప్రదర్శనలు ఇస్తే, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని మరో కళాకారిణి రేణు జంగ్రా ప్రశ్నించారు.