బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 మే 2024 (11:30 IST)

వెజ్ శాండ్విజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఇచ్చారు.. రూ.50 లక్షల పరిహారం కోరిన లేడీ కస్టమర్!

ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా వెజ్ శాండ్విజ్ ఆర్డర్ చేసిన ఓ మహిళా కస్టమర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆమె వెజ్ శాండ్విజ్ ఆర్డర్ ఇస్తే.. నాన్ వెజ్ శాండ్విచ్ డెలివరీ చేశారు. దీంతో సంబంధిత రెస్టారెంట్ యాజమాన్యంపై ఆమె రూ.50 లక్షల పరిహారం కోరుతూ కోర్టుకెక్కేందుకు సిద్ధమయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అహ్మదాబాద్‌ నగరానికి చెందిన నిరాలీ అనే మహిళ ఈ నెల 3వ తేదీన పనీర్ 'పిక్ అప్ మీల్స్ బై టెర్రా' నుంచి పనీర్ టిక్కా శాండ్విచ్ ఆర్డర్ చేసింది. ఇంటికి ఫుడ్ డెలివరీ అయ్యాక రెండు ముక్కలు తిన్న ఆమెకు సందేహం వచ్చింది. శాండ్విచ్ సాధారణం కంటే కాస్తంత గట్టిగా అనిపించడంతో చూస్తే అది చికెన్ శాండ్విచ్ అని తేలింది. దీంతో, మండిపడ్డ మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో, ఆహార శాఖ ఆ రెస్టారెంట్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. అయితే, విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టని మహిళ రెస్టారెంట్ నుంచి రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధమైంది. 'ఇదో భయానక ఘటన. జరిగింది వెనక్కు తీసుకోలేము. రూ.5 వేల జరిమానా సరిపోదు. నేను వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తా. రూ.50 లక్షల కంటే ఎక్కువ పరిహారాన్ని నేను అడిగుండేదాన్నే. అప్పుడు కూడా నాకు తగిన న్యాయం జరిగి ఉండేది కాదు' అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం ఇంతవరకూ స్పందించలేదు.