శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By chj
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (18:53 IST)

దసరాకు రెండు రోజుల ముందుగా బతుకమ్మ... ఏం చేస్తారు?

బతుకమ్మ పండుగకు తెలంగాణాలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దసరాకు రెండు రోజుల ముందు నుంచే ఈ బతుకమ్మ పండుగను స్త్రీలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగకు తెలంగాణాలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దసరాకు రెండు రోజుల ముందు నుంచే ఈ బతుకమ్మ పండుగను స్త్రీలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ గుంరించి ఎన్నో కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబందించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది. 
 
బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని గౌరమ్మను వేడుకుంటారు. అక్టోబర్ నెలలో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్నసమయంలో తెలంగాణాలోని వాతావరణం మెుత్తం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉంటుంది. చెరువులన్నీ తాజా నీటితో నిండి ఉంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో తంగేడు పూవు ప్రధమస్ధానంలో ఉంటుంది. 
 
ఇలాంటి వాతావరణంలో తెలంగాణా ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణా ఆడపడుచులు చిన్నచిన్న బతకమ్మలను తయారుచేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతకమ్మని నిమజ్జనం చేస్తారు. 
 
బతుకమ్మపండుగ చివరిరోజు జరిగే వేడుకలు, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. నయన మనోహరకరంగా ఉంటుంది. తంగేడు పూలతో పాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పూవు తర్వాత మరో రంగు పూవును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మని తయారుచేస్తారు.  బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. 
 
ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తరువాత బతుకమ్మని బయటకు తీసుకు వచ్చి గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడతారు. తరువాత ఇంటి నుంచి తీసుకు వచ్చిన పెరుగన్నం, మెుక్కజొన్నలు, వేరుశనగ, పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం కలిపిన సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదంలా స్వీకరిస్తారు. తర్వాత బతకమ్మలను తలపై పెట్టుకొని పెద్ద చెరువుకి ఊరేగింపుగా వెళతారు. జలాశయం చేరుకున్న మహిళలు బతకమ్మ పాటలు పాడుతూ నీటిలో జారవిడుస్తారు. తర్వాత చక్కెర, రొట్టెతో చేసిన మలీద అనే వంటకాన్నిబంధువులకు పంచిపెట్టి తింటారు. ఆ తర్వాత ఖాళీ పళ్లెంతో ఇంటికి చేరుతారు.