చేపలతో టిక్కా ట్రై చేస్తే.. వావ్ టేస్ట్ అదిరిపోద్ది..
చేపలను వారంలో ఒకటి లేదా రెండుసార్లైతే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఈ కారణంగా రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. చేపలను తరచూ తినడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతుంది. అలాంటి చేపలతో కూర, ఫ్రై చేసి బోర్ కొడితే ఈసారి టిక్కా ట్రై చేయండి.
ఎలా చేయాలంటే..
చేపలు - ఒక కేజీ
పెరుగు- ఒకటిన్నర కప్పు
నిమ్మరసం- ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
మొక్కజొన్న పిండి - పావు కప్పు
గరం మసాలా - చెంచా
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారీ విధానం..
ముందుగా ముళ్లు అధికంగా వుండే చేపలు కాకుండా ఒకే ముళ్లు వుండే చేపలను తీసుకోవాలి. వాటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఓ పాన్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చేప ముక్కలకు గరం మసాలా, పావు స్పూన్ నూనె, ఉప్పు, పెరుగు, కారం, మొక్కజొన్న పిండి, నిమ్మరసం చేర్చి బాగా కలుపుకోవాలి.
అరగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. తర్వాత టిక్కా స్టిక్స్ లేదా కబాబ్ స్టిక్స్‌కు చేపముక్కల్ని గుచ్చాలి. పొయ్యిపై పెనం పెట్టి వేడయ్యాక.. దానిపై ఫిష్ ముక్కల్ని గుచ్చిన స్టిక్స్‌ను బ్రౌన్‌గా వేపుకోవాలి. తర్వాత వాటిని సర్వింగ్ బౌల్‌లో తీసుకుని.. సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.