మలబార్ స్పెషల్.. మత్తి చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఏర్పడే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. మత్తి చేపలను వారానికి ఒక్కసారైనా డైట్‌లో చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇంగ్లీష్‌లో సార్డినెస్ అని పిలువబడే మత్తి చేపలను తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరవు. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు.. అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి.
ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. వాపును తగ్గిస్తాయి. క్యాన్సర్‌ను నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. సార్డినెస్‌లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి.
సార్డినెస్‌లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నందున, అవి ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. మత్తి చేపలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వారానికి రెండుసార్లు మత్తి చేపలను తీసుకుంటే మెరిసే చర్మాన్ని అందిస్తుంది. మత్తిచేపలు మధుమేహాన్ని దూరం చేస్తాయి. ఈ చేపల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండటం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాంటి మత్తి చేపలతో కూర సిద్ధం చేసుకుని వేడి వేడి అన్నంతో తీసుకుంటే.. టేస్టు అదిరిపోతుంది.. ఇంకా అందరూ ఇంకా ఇంకా కావాలని లొట్టలేసుకుని తినడం ఖాయం.
మత్తి చేపల వంటకం తయారీ ఎలాగో చూద్దాం..
కావలసిన పదార్థాలు
మత్తి చేపలు - అరకేజీ
తురిమిన కొబ్బరి - కప్పు
కాశ్మీరీ ఎర్ర మిరప పొడి - రెండ్లు స్పూన్లు
కారం పొడి - రెండ్లు స్పూన్లు
పసుపు పొడి - అరస్పూన్
కొత్తిమీర తురుము - పావు కప్పు
ఉప్పు - రుచికి
కరివేపాకు - పావు కప్పు
అల్లం పేస్ట్ - రెండు స్పూన్లు
చింతపండు - నిమ్మకాయంత
పచ్చిమిర్చి తరుగు - పావు కప్పు
కొబ్బరి నూనె - రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
ఉల్లి తరుగు - ఒక కప్పు (చిన్న ఉల్లిపాయలు)
తయారీ విధానం :
ముందుగా కొబ్బరి తురుమును పేస్టు చేసుకోవాలి. ఇందులోనే మిరపపొడి, కాశ్మీర్ చిల్లీ పొడి, పసుపు, కాసిన్ని ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను అందులో చేర్చాలి.
మసాలా బాగా వేగాక కాసిన్నీ నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన చిన్న ఉల్లిపాయను చేర్చండి. ఆపై అల్లం పేస్టు, కరివేపాకు వేసి కాసేపు మూతపెట్టండి. ఆపై చింతపండు రసం చేర్చుకోవాలి. ఇందుకు సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమం బాగా ఉడికి పచ్చివాసన పోయాక.. శుభ్రం చేసి వుంచిన మత్తి చేపల ముక్కలను వేసి ఐదు నిమిషాలు వుంచాలి. చివరిన కొబ్బరి నూనె చేర్చాలి.
ఉల్లిపాయలు కాసిన్ని, కరివేపాకు జోడించి.. 2 నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే మత్తి చేపల కూర రెడీ. ఈ కూరను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని.. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.