శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 4 జులై 2016 (16:08 IST)

ATA (అమెరికా తెలంగాణ అసోసియేషన్) కన్వీనర్ వినోద్ కుకునూర్‌తో కాసేపు..

జూలై 8 నుండి 10 వరకు డెట్రాయిట్లో జరుగబోయే తెలంగాణ ప్రథమ ప్రపంచ మహాసభలని పురస్కరించుకొని మీడియా ప్రతినిధి కృష్ణ చైతన్య అల్లంతో కన్వీనర్ వినోద్ కుకునూర్ గారు కార్యక్రమ వివరాలని తెలియ చేసారు. ఆ వివరాలు...
 
కృ.చై: ఇంతటి బృహత్తర కార్యాన్ని తలపెట్టారు. ఇప్పటివరకు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? ఎలా అధిగమించారు?
వి.కు: దాదాపు 1,00,000 భారతీయులు నివసించే డిట్రాయిట్ ఏరియాలో 15,000 మందికి పైగా తెలుగువారు ఉంటారని అంచనా. ఇది కేవలం డిట్రాయిట్ మాత్రమే. ఈ కార్యక్రమాన్ని డిట్రాయిట్ తీసుకురావడం, ప్రపంచం నలుమూలల నుండీ తెలుగు వారిని ఆహ్వానించి ఒకచోట చేర్చడం మా మీద భాద్యత పెంచింది. ఒక సంవత్సరానికి సరిపడా పని చేతిలో ఉంది. 45 కమిటీలు అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. అయినా ఒక బృహత్తర కార్యక్రమంలో భాగమైనందుకు కలిగే ఆనందం ముందర శ్రమ చిన్నదిగా కనిపిస్తుంది.
 
కృ.చై: ఇటువంటి పని తలపెట్టి (ప్రపంచ మహా సభలు) కొన్ని సంస్థలు విఫల యత్నం చేసాయి. వారితో పోలిస్తే ఈ సభల్లో ఎలాంటి విభిన్నత ఉండబోతుంది?
వి.కు: నిజమే. ఇదీ ఫార్మాట్ అని ఎవరినీ బెంచ్ మార్క్‌లా తీసుకోలేదు. బెంచ్ మార్క్ సెట్ చేసే దిశగా ఈ సభలు నిర్వహించబడుతున్నాయి. సమరుజ్జీవనానికి ప్రతీక తెలంగాణతనం. నేను గొప్ప కాబట్టి నువ్వు నాతో నడవమని చెప్పే యత్నాలు సరి కాదు. మనందరం కలిసి నడుద్దాం అని చెప్పే సంస్థలో ఔన్నత్యం ఉంటుంది. 10000 నుండి 25000 వరకు సభ్యులు ఉన్న 45 సంస్థలని ఏకం చేసి ఒక తాటిమీదకు తెచ్చి కలిసి నడుద్దాం అని చెప్పే సంఘటిత భావమే అమెరికా తెలంగాణ అసోసియేషన్. అశేష సంఖ్యలో ఇలాంటి పనులని ఎన్నో పూర్తిచేసిన అనుభవజ్ఞులయిన ఎందరో ఇక్కడ ఒక్కో ఇటుకా మోస్తున్నారు. చేస్తున్న ప్రతీ పనిలో ఈ భావమే వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మాలో సామాజిక భాద్యతలని భుజాన వేసుకుని నడిపింప చేస్తుంది. 
 
కృ.చై: అనేకమంది ప్రముఖులు హాజరయ్యే ఈ ఈవెంట్లో, లోటుపాట్లని పర్యవేక్షించే పనులు ఎలా ఉండబోతున్నాయో తెలియ చేస్తారా?
వి.కు: తప్పకుండా. దాతలు మాకు స్పూర్తి ప్రదాతలు. హాజరయ్యే ప్రముఖులు, అతిథిదేవుళ్ళు అందరూ ఏ ఇబ్బందులనీ ఎదుర్కోవద్దని మేము అన్ని రకాల చర్యలని తీస్కున్నాం. అడ్–హక్ కమిటీ గంటగంట సమస్యలని పర్యవేక్షిస్తుంది. సమస్యలు పెద్దవైనపుడు స్వాట్ టీం కన్వీనర్ స్థాయి అనుమతులతో అప్పటిడప్పుడు సమస్యలని పరిష్కరిస్తుంది. సమాంతరంగా జరిగే కార్యక్రమాలలో వందల మంది వాలంటీర్లు, యూత్ కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారు. ఇంకా సందేహాలు ఉంటే ఇన్ఫర్మేషన్ డెస్క్, ఫోన్ కాల్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. 
 
కృ.చై: చిన్నచిన్న విషయాల మీద ఇంత శ్రద్ధ తీసుకోవడం అభినందనీయం. కన్వీనర్‌గా ఇవన్నీ సమన్వయపరచడం ఎలా సాధ్యమయింది?
వి.కు: సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన అనేకమంది అనుభవజ్ఞులు ఒకటి చెప్తే పది చేసుకుపోయే ఇండిపెండెంట్ స్థాయి కమిటీల వల్ల ఇది సాధ్యమయింది. పీఎంవో ఆఫీస్ మోడల్ పాటించడం జరిగింది. ప్రతీ టీంకి ఒక టెంప్లెట్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటుంది. అందరూ కాల్ చేసుకుని, మీట్ అయి, రియల్ టీం అప్డేట్స్ తీసుకుని డైనమిక్‌గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని పని ముందుకు సాగిస్తారు. ఒక లాజికల్ హైయర్ ఆర్కీ, ఇండివిజువల్ ప్లానింగ్‌ల కలయిక వల్ల ఇది సాధ్యమయింది.
 
కృ.చై: అద్భుతం. ప్రపంచ స్థాయి అంటే ఏంటో అర్థం అవుతుంది. మీ మాటలు విన్నాక ఈ కార్యక్రమం ఆల్రెడీ విజయవంతం అయిందని అనిపిస్తున్నది. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు. 
వి.కు: ఎంత మాట. థాంక్ యూ.