సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 మే 2023 (16:52 IST)

న్యూజెర్సీలో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన

image
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు నాట్స్ నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన లభించింది. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరో మోరిస్ డేవిసన్ పార్క్ కోర్టుల్లో జరిగిన ఈ వాలీబాల్‌ టోర్నమెంటులో 18 జట్లు పోటీ పడ్డాయి. ప్లే ఆఫ్ నుంచి ఫైనల్స్ వరకు జరిగిన మొత్తం 70 మ్యాచ్‌ల్లో తెలుగువారు ఉత్సాహంగా వాలీబాల్‌ ఆటలో తమ సత్తా చాటారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ ఎంతో రసవత్తరంగా జరిగాయి. వందలాది మంది తెలుగు వాలీబాల్ అభిమానులు ఈ మ్యాచ్‌లను తిలకించడానికి వచ్చేసి.. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.
 
మేజర్ లీగ్‌లో ఛాంపియన్‌షిప్ మెగ్ టెక్ వోల్వ్స్ జట్టు (మిడిల్సెక్స్ కౌంటీ) కైవసం చేసుకుంది. రన్నరప్‌గా ప్లేన్స్‌బోరో నుండి వచ్చిన బుల్‌డాగ్స్ జట్టు నిలిచింది. మైనర్ లీగ్‌లో హిల్స్‌బోరోకు చెందిన అవెంజర్జ్ జట్టు ఛాంపియన్ షిప్ చేజిక్కుంచుకుంది. రన్నరప్‌గా డి ఘుమా కే జట్టు మోన్రో (కౌంటీ) నిలిచింది. వాలీబాల్ టోర్నమెంట్‌లో ప్రధాన విజేతలకు $1200, రన్నరప్స్‌కి $800, మైనర్ లీగ్ విజేతలకు $800 రన్నరప్స్‌కు $400 నగదు బహుమతి నాట్స్ ప్రకటించింది.  ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల వేదికపై ప్రైజ్ మనీని ప్రదానం చేయనుంది.
 
నాట్స్  కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ సరోజా సాగరం, కో-డైరెక్టర్ చంద్రశేఖర్ కొణిదెల, చైర్ శ్రీనివాస్ కొల్లా, కో-ఛైర్ సుబ్బరాజు గాదిరాజు, గణేష్ పిల్లరశెట్టి, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ నీలం, గోవింద్ రంగరాజన్, శ్రీనివాస్ వెంకటరామన్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌ను దిగ్విజయం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య (బాపు)నూతి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
 
విజేతలందరికీ సంబరాల కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, డిప్యూటీ కన్వీనర్స్ రాజ్ అల్లాడ,  శ్రీహరి మందాడి, కో కోఆర్డినేటర్ శ్యామ్ నాళం, పోగ్రామ్స్ డైరెక్టర్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ నాయకులు, టి పి రావు, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుఱ్ఱం మెడల్స్ ప్రదానం చేశారు. ఈవెంట్ స్పాన్సర్‌లు సదరన్ స్పైస్ నార్త్ బ్రున్స్‌విక్ మరియు బావర్చి బిరియానీస్ ఎడిసన్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో తోడ్పడ్డారు.