అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి లాంటి నగలు, ఆభరణాలు కొనుగోలు చేయడం అలావాటుగా మారింది. అక్షయ తృతీయ రోజు ఏ శుభ కార్యాన్నైనా వారం, వ్యర్జం, రాహు కాలంతో నిమిత్తం లేకుండా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి బ్రాహ్మాణులకు దానం చేస్తే మంచి జరుగుతుందని ప్రజల్లో నమ్మకముంది. అంతేకాదు గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు ప్రారంభించవచ్చని పండితులు చెబుతున్నారు.
వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది.
ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలం అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.
ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యాన్ని చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.
ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితం కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు.
అక్షతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్లు లేని, గట్టిగా ఉన్న బియ్యం. అవి వరి ధాన్యం నుండి కావచ్చు, గోధుమ ధాన్యం నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.
బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి.