జూలై 25న గరుడ పంచమి.. ఆ వ్రతాన్ని ఆచరిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?
ఈ నెల అంటే జూలై 25న గరుడ పంచమి వస్తోంది. గరుడ పంచమి విశిష్టత ఏంటో ఈ సందర్భంగా తెలుసుకుందాం.. ఈసారి గరుడ పంచమి శనివారం వస్తుండటం విశేషం. ఎందుకంటే.. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజున.. ఆయన వాహనంగా పేరొందిన గరుడ పంచమి రావడం విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు.
పూర్వం బ్రహ్మదేవుని కుమారుడైన కశ్యపుని నలుగురు భార్యల్లో కద్రువ, వినత అనే ఇద్దరు సోదరీమణులు వుండేవారు కద్రువ నాగులకు తల్లిగానూ, వినత అరుణుడు, గరుడికి తల్లిగా భాసిల్లారు. ఓసారి కద్రువ, వినతల మధ్య వివాదం మొదలైంది. ఇంకా పోటీ కూడా నెలకొంది. అలా పోటీల్లో ఓడిన వారు.. గెలిచిన వారికి దాస్యం చేయాలన్నదే పోటీ నిబంధన.
అలా కద్రువ చేతిలో వినత ఓడటంతో ఆమె కుమారులు అరుణుడు, గరుడుడు బానిసలుగా మారిపోయారు. అలా ఈ బానిసత్వం నుంచి తల్లితో పాటు ఇతరులను కాపాడాలని గరుడుడు శపథం చేస్తాడు. అప్పుడు కద్రువ దేవేంద్రుని వద్ద నున్న అమృత కలశాన్ని తెచ్చినట్లైతే.. వినతతో పాటు అరుణుడు, గరుడినికి బానిసత్వం తొలగిపోతుందని చెప్పింది. దీంతో సంతోషంతో గరుడుడు దేవలోకానికి వెళ్ళాడు.
ఆ సమయంలో దేవతలకు గరుడినికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి గరుడుడు విజయం సాధించాడు. ఆపై దేవేంద్రుడిని ప్రార్థించి.. ఆయన వద్ద వున్న అమృత కలశాన్ని తీసుకెళ్లి కద్రువ చేతిలో పెట్టాడు. ఇలా కద్రువ బానిసత్వం నుంచి ముగ్గురు బయటపడ్డారు. అలాంటి మహిమాన్వితుడైన గరుడుడు పుట్టిన రోజునే గరుడ పంచమిగా జరుపుకుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి జన్మించిది కనుక సర్పభయం లేకుండా ఉండడం కోసం ఈ రోజంతా నాగపూజలు చేస్తుంటారు. అలాగే ఇదే రోజున గరుడ పంచమిని కూడా జరుపుకుంటారు. ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది.
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది.
అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి.