మంగళవారం భూములను కొనడం చేయవచ్చా..?
మంగళవారం హనుమంతుని పూజకు శ్రేష్ఠం. అలాగే దుర్గామాతకు పూజ చేసే వారికి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మంగళవారం సుందరకాండ పారాయణ చేసినా, మహాభారతం చదివినా చాలా మంచిది. కుజగ్రహ దోషాలతో పాటు ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం, ఆంజనేయ స్వామిని పూజించడం చేస్తే, మంగళవారం అవరోధాలు తొలగిపోతాయి.
అలాగే భూ వ్యవహారాలకు కూడా మంగళవారం శుభకరం. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా తగు నిర్ణయం తీసుకోడానికి మంచిది. అయితే అగ్రిమెంట్ లాంటివి మాత్రం మంగళవారం చేయకూడదు. కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోడానికి మంగళవారం మంచిరోజు. కానీ మంగళవారం అప్పు తీరిస్తే, భవిష్యత్తులో అప్పులు చేసే స్థితి రాకుండా ఉంటుందని, అందుచేత అప్పులు ఏవైనా తీర్చాల్సి ఉంటే, మంగళవారం తీర్చాలని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.
నీతి నిజాయితీలతో వ్యవహరించేవారికి మంగళవారం విజయాలు చేకూరుతాయి. ఇక ఇంట్లో పాడైపోయిన వస్తువులు, ఫ్రిజ్‌లు, కూలర్లు, వాషింగ్ మిషన్ లాంటివి రిపేర్ చేయించుకోడానికి మంగళవారం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
పరిశోధనల్లాంటి పనులు కూడా మంగళవారం చేయవచ్చు. ఇక ఏ వ్యక్తయినా తప్పుచేస్తే నిలదీయడానికి, గట్టిగా అడగడానికి కూడా మంగళవారం మంచిదే. అయితే మనవైపు తప్పు ఉండకూడదు. అప్పుడే అది మనకు కలిసివస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.