శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (16:17 IST)

బుద్ధ జయంతి: అర్థరాత్రి రాజభవనం నుంచి బయటకు వచ్చాడు

Buddha
బాల్యంలో సిద్ధార్థుడు అని పిలువబడే బుద్ధుడు రాజవుతాడు కానీ విరక్తుడై లోకకళ్యాణ కారకుడవుతాడని పండితులు చెప్పడంతో గౌతముని తండ్రి శుద్ధోదనుడు పెద్ద భవనం నిర్మించి రాకుమారుని అందులో ఉంచాడు. రోగములు, దుఃఖములు, మృత్యువులు ఏమీ తెలియనీయకుండా పెంచాడు.


ఆ తర్వాత గౌతమునికి యశోధరతో వివాహం జరిపించాడు. వీరికి రాహులుడు అనే పుత్రుడు కలిగాడు. ఒకసారి నగరము చూచేందుకు వెలుపలకు వచ్చాడు సిద్ధార్థుడు. నగరము నందు తిరిగే సమయంలో ఒక వృద్ధుడు కనిపించాడు. మరోసారి నగరం సందర్శించేటపు ఒక రోగి కనిపించాడు. మూడోసారి చనిపోయినవాడు కనిపించాడు. 

 
ఈ దృశ్యాలను చూచిన సిద్ధార్థుని మనస్సు చలించిపోయింది. సంసార సుఖము నుండి విరక్తి చెందాడు. అమరతత్వమును పరిశోధించేందుకు ఒక అర్థరాత్రి రోజున రాజభవనం నుండి బయటికి వచ్చి, తపస్సు చేసి బుద్ధుడైయ్యాడు. ప్రపంచమంతా తిరిగి మానవ ధర్మాలను ప్రచారం గావించిన బుద్ధుడు, యజ్ఞములందు పశువధను మాన్పించాడు. జీవుల పట్ల ప్రేమ, అహింస సద్భావములతో అమర సందేశమిచ్చాడు.

 
ఆయన బోధనల్లో కొన్ని.. సంసారము దుఃఖమయం, తృష్ణ దుఃఖ కారణము. తృష్ణ నశించిన, దుఃఖము నశించును. రాగద్వేష అహంకారములను వదిలిన జీవులు ముక్తులవుతారు. 1. సత్యము 2. నమ్రత 3. సదాచారము 4. సద్‌విచారము 5. సద్గుణము 6. సమృద్ధి 7. ఉన్నతమైన లక్ష్యము 8. ఉత్తమమైన ధ్యానము.. ఈ ఎనిమిది సాధనములను బుద్ధ భగవానుడు మానవుల ఉన్నతి కొరకు చెప్పాడు.