శాకంబరీదేవి ఆవిర్భవించి ఆకలిని తీర్చింది ఆషాఢ మాసంలోనే.. (Video)

Mango Leaves
Mango Leaves
సిహెచ్| Last Updated: శనివారం, 27 జూన్ 2020 (18:49 IST)
ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నటం ప్రారంభించేరోజు. పూర్వం ఈరోజును పండగలా చేసుకునేవారు. ఇప్పటికి కొన్ని గ్రామాలలో ఈ పండగను జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరిజల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం.

శాకములు అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తాము కనుక ఈ తల్లిని శాకంబరీ దేవి అంటాము. ఈ విధంగా పంట తొలిదశలో వున్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృధ్దిగా పండుతాయనీ, పాడిపంటలకు లోటు ఉండదనీ విశ్వాసం. ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకంబరీదేవి.

శాకంబరీ దేవి అవతారం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాము...
పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. సకల లోకాలను స్వాధీనం చేసుకోవాలని భావించిన దుర్గముడు దేవతలు, మహర్షుల బలం వేదాలలో దాగివుంది. వాటిని నిర్వీర్యం చేస్తే వారి బలం తగ్గి విజయం సాధించవచ్చునని అనుకున్నాడు. అందుకు బ్రహ్మను గురించి తపస్సు చేసి, మెప్పించి వరం పొందాడు. దీనితో వేదవిద్యలన్ని దుర్గముడు వశం కావడంతో పూజలు పునస్కారాలు, వేదాధ్యాయనం, యజ్ఞయాగాలు, నిలిచిపోయాయి.

హోమాలు లేకపోవడంతో వర్షాలు లేకుండా పోయాయి. ఫలితంగా పంటలు లేక తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. తినడానికి తిండి, త్రాగటానికి నీరు లేక ప్రజలు విలవిలాడిపోయారు. ఈ సమయంలో పరిస్థితులను గమనించిన మహర్షులు దుర్గముడును అణచివేసే శక్తిసామర్థ్యాలు జగన్మాతకే ఉన్నాయి. కనుక జగన్మాతను ఆరాధించాలని భావించారు. మహర్షులు అనేక విధాలుగా అమ్మను ధ్యానించి ప్రసన్నము చేసుకున్నారు. జగన్మాత ప్రత్యక్షమై వారి కోరికను విని అయోనిజగా అవతరిస్తాను.

నూరు కన్నులతో ఉన్న నేను ముల్లోకాలను కాపాడుతాను. అంతేకాకుండా వర్షాలను కురిపించి జగతిని సస్యశ్యామలం చేస్తాను అని జగన్మాత వరాన్ని ప్రసాదించింది. వరం ప్రకారం అమ్మవారు శాకములను ప్రసాదించి సకల లోకవాసులని ఆకలి తీర్చి శాకంబరీ దేవిగా పూజలందుకుంటున్నట్టు పురాణకథనం.

అనంతరం అమ్మవారు దుర్గముడును అంతమొందించి వేదాలను రక్షించి సకల లోకాలను వర్థిల్లింప చేసింది. ఈ విధంగా తీవ్రమైన కరువు పరిస్థితులలో అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది ఆషాఢమాసంలోనే. అందుకే ఆషాఢమాసంలో దేవీక్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు.

దీనిపై మరింత చదవండి :