సంకటహర చతుర్థి.. గణపయ్యకు టెంకాయతో మాల వేస్తే? (video)
సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈసారి వినాయక చవితి పౌర్ణమికి తర్వాత సెప్టెంబర్ 13 సంకష్టహర చతుర్థి వస్తోంది. ఈ రోజున కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట.
ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.
ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన మాలను వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. నైవేద్యం సమర్పించి సంకటహర చతుర్థి వ్రతకథని చదువుకోవాలి.
ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయడం కానీ కుదరకపోతే.. ఆ రోజు ఓ నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లి స్వామిని దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. అలాగే సంకష్టహర చతుర్థి రోజున నారికేళము అంటే టెంకాయతో చేసే కొబ్బరి కాయ మాలను విఘ్నేశ్వరునికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.
అంతేకాదు. ఈ నారికేళాన్ని సంకష్ట హర చతుర్థి పూజకు తర్వాత ఆలయం నుంచి ఇంటికి తెచ్చుకుని ఆ నారికేళానికి పసుపు, కుంకుమ బెట్టి.. రోజువారీగా పూజ చేయడం ద్వారా సకలసంపదలు కలుగుతాయి. అంతేగాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఆ టెంకాయను ప్రవహించే నీటిలో జారవిడవడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.