1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (17:18 IST)

భగవంతుడికి చావు పుట్టుకలు లేనివాడు..!

రాముడు చైత్రమాసం శుద్ధపక్షం నవమినాడు పుట్టాడు. అవతార పరిసమాప్తి వేళ సరయూనదిలోనికి ప్రవేశించి బ్రహ్మదేవుడు పైనుండి రాగా ఆయనతో కలిసి వైకుంఠానికి వెళ్లాడు. ఇది నిర్యాణం కాదు. ఇక కృష్ణుడు శ్రావణమాసం బహులపక్షం అష్టమినాడు దేవకీ వసుదేవులకి శంఖ చక్ర గదా ధారియౌతూ పట్టు పీతాంబరంతో శ్రీహరిగా దర్శనమిస్తూ అవతరించాడు భూమికి. 
 
ఇది పుట్టుక కాదు. అవతారపు ముగింపు వేళ ఎవరికీ చెప్పకుండా తాను ఒక పొదలో ఉండి ఉన్నవేళ బాణపు దెబ్బకి నిర్యాణాన్ని చెందాడు. అటు రామునికి పుట్టుక ఉంది. మరణం లేదు. ఇటు కృష్ణునికి పుట్టుక లేదు. మరణం ఉంది. ఈ రెంటినీ కలిపి పరిశీలిస్తే భగవంతునికి చావు పుట్టుకలు రెండూ లేవనే యథార్థం గోచరిస్తుంది. 
 
కృష్ణ అంటే.. కర్షతీతి కృష్ణః ఆకర్షించే లక్షణం కలవాడని ఈ మాటకి ఉన్నటువంటి అర్థం. ఏమాత్రపు చదువూ లేని గోప బాలురినీ - పాలూ పెరుగులని అమ్మి జీవనం చూస్తుంటే గోపికా జనాన్ని, ఎప్పుడు తనని చంపుతాడోననే భయంతో ఉన్న కంసుణ్ణీ- శత్రుత్వమున్న కారణంగా ఏ క్షణంలో ఏం చేస్తాడోనన్న వైరంతో ఉన్న శిశుపాలుణ్ణీ- బాంధవ్యంతో వృష్ణ (యదు) వంశం వారందరినీ - ప్రేమదృష్టితో పాండవులు, భీష్ముడు, విదురుడు మొదలయినవారినీ ఆకర్షించిన వాడు శ్రీ కృష్ణభగవానుడు.