గురు పౌర్ణమి.. వ్యాస పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?
Guru Purnima
గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల జీవిత కాలాన్ని, బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వారే వ్యాసుడు.
వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే. ఇంకా భాగవాతాన్ని రచించారు. శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.
అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారని పండితులు చెబుతారు. ఈ గురు పూర్ణమి రోజున వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలని పండితులు అంటున్నారు.
