శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:49 IST)

స్వామిమలై గురించి మీకు తెలుసా?

తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రఖ్యాత దేవాలయాలు ఉన్నాయి. అందులో చాలా వాటికి స్థల పురాణాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలోని స్వామిమలై. స్వామి మలై అంటే దేవుని పర్వతం అని అర్థం. తమిళనాడులో ఉన్న ఆరు ముఖ్యమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఇది నాల్గవది. ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఉంది. 
 
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందిన స్థలమిది. సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది. ఇంత అద్వితీయమైన క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి సృష్టికర్త బ్రహ్మ కైలాసానికి వెళుతుండగా దారిలో కుమార స్వామి తారసపడ్డాడు. కుమార స్వామి ఊరుకోక దేవతలకు సైతం అర్థం తెలియని ప్రశ్నను అడిగాడు. ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు. 
 
దేవతలు కూడా సమాధానం ఇవ్వలేక అయోమయ పరిస్థితులలో పడ్డారు. బ్రహ్మ దేవుడు కూడా జవాబు చెప్పలేకపోయేసరికి ఆయన్ను బందీ చేశాడు కుమార స్వామి. దాంతో సృష్టి ఆగిపోయింది. దేవతలు అందరూ వెళ్లి పరమశివునితో మొరపెట్టుకున్నారు. అందరూ కలసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు, బ్రహ్మదేవున్ని ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు. అందుకే బందీని చేశానని సమాధానం చెప్పాడు. 
 
అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు. ఆయనకి తెలియదని బందీని చేశావు సరే. మరి నీకు తెలుసా అని అడుగగా నేను చెప్తాను అన్నాడు. అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలున్న శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు. తర్వాతేముంది కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. తండ్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు. ఈ క్షేత్రం గురించి మరో పురాణ కథనం కూడా ఉంది. 
 
భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్థ్వలోకాలకి వ్యాపించగా, ఆ వేడిమిని భరించలేని దేవదేవుళ్ళు ఆ పరమేశ్వరుని శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి దేవలోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు. దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఞానం నశించింది. 
 
తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై, నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి స్వామి నాథుడనే పేరు వచ్చింది. ఈ స్థలానికి స్వామిమలై అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం కూడా చాలా మహిమ కలది. 
 
ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి. కొంగు ప్రాంతం నుండి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనికి కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకున్ని నేత్ర వినాయగర్ అని పిలుస్తారు.