గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 9 ఆగస్టు 2016 (13:43 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో వెండి సాలగ్రామాలు... విమాన వేంకటేశ్వరుని దర్శించిన తర్వాతే...

తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూల విరాణ్మూర్తి, ఇతర ఉత్సవమూర్తులతో పాటు ప్రత్యేకంగా నాలుగు పెద్ద సాలగ్రామాలు, ఇంకా చిన్న సాలగ్రామాలు కొన్ని నిత్యాభిషేకార్చనలందుకుంటూ ఉన్నాయి. ఈ సాలగ్రామాలన్నీ శ్రీ స్వామివారి పాదాల చెంత వెండి పాత్రల్లో

తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూల విరాణ్మూర్తి, ఇతర ఉత్సవమూర్తులతో పాటు ప్రత్యేకంగా నాలుగు పెద్ద సాలగ్రామాలు, ఇంకా చిన్న సాలగ్రామాలు కొన్ని నిత్యాభిషేకార్చనలందుకుంటూ ఉన్నాయి. ఈ సాలగ్రామాలన్నీ శ్రీ స్వామివారి పాదాల చెంత వెండి పాత్రల్లో ఉంచబడి పూజింపబడుతూ ఉన్నాయి. 
 
ప్రతిరోజు భోగ శ్రీనివాసమూర్తులతో పాటు ఈ సాలగ్రామాలకు అభిషేకం జరిగిన తరువాత అన్ని మూర్తులతో పాటు ఈ సాలగ్రామాలకు పుష్పార్చన, నివేదన జరుపబడుతున్నది. ఇలా పూజలందుకుంటూ ఉన్న సాలగ్రామాలు మాత్రమే కాక, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యమూలవిరాణ్మూర్తికి ఇరువైపులా రెండు భుజాల నుంచి పాదాల వరకు వేలాడుతున్న దివ్యసాలగ్రామ హారాలు నిత్యశోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
 
బంగారు కవచాలలో పొదుగబడి కూర్చబడిన ఈ రెండు సాలగ్రామ హారాలు మాత్రమే కాకుండా పూర్వం ప్రసిద్ధ ద్వైత సంప్రదాయ పీఠాధిపతులైన శ్రీ వ్యాసతీర్థులవారు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి మరొక సాలగ్రామహారం సమర్పించినట్లు తెలుస్తోంది. విజయనగర చక్రవర్తులైన వీర నరసింహరాయలు, క్రిష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ఇలా ఈ ముగ్గురికీ గురువులుగా ప్రసిద్థి చెందిన వారు శ్రీ వ్యాసరాయలు.
 
ముఖ్యంగా శ్రీ క్రిష్ణదేవరాయలకు కలిగిన కుహూ యోగమనే కాలసర్పదోషం నుండి రక్షించడానికి కొన్ని ఘడియల కాలం విజయనగర సింహాసనాన్ని అధిష్టించి తమ తపస్సక్తి చేత ఆ సర్పదోషాన్ని భస్మం చేశారట. అందువల్ల కొద్దికాలం విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన వ్యాసతీర్థులవారికి వ్యాసరాయలు అనే ప్రసిద్థ నామం ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది.
 
ఆ తరువాత అదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చన నిర్వహిస్తూ ఉన్న వైఖానస అర్చకులకు ఏదో అవాంతరం ఏర్పడి శ్రీ స్వామివారి అర్చనాది కార్యక్రమాలకు విఘాతం కలుగగా శ్రీ వ్యాసతీర్థుల వారు సుమారు 12 యేళ్ళ పాటు తిరుమల క్షేత్రంలోనే ఉంటూ స్వయంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారట. ఆ తరువాత అర్చనాది కార్యక్రమాలు పరహస్తం కాకుండా తిరిగి సంప్రదాయం ప్రకారం వైఖానస అర్చకులకు అప్పజెప్పారట. అంతేకాదు.. ఈ వ్యాసరాయలవారి కాలం నుండే ఆనందనిలయం మీద ఉండిన విమాన వేంకటేశ్వరస్వామి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాడు.
 
పూర్వం విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయ విమాన వేంకటేశ్వరస్వామి వారికి దర్శించిన తరువాతనే ఆనందనిలయం లోపలి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి దర్శించుకునేవారు. ఒకవేళ పూజాది కార్యక్రమాల వల్ల నివేదనల వల్ల ఆనందనిలయంలోపల ఉన్న శ్రీనివాసుని దర్శనం కాకపోయినా ఫరవాలేదట కాని, విమాన వేంకటేశ్వరుని దర్శనం చేస్తే చాలన్న అభిప్రాయం వ్యాసతీర్థుల వారి కాలం నుంచే ఏర్పడింది.
 
ఈ వ్యాసతీర్థుల వారు కూడా భగవద్రామానుజుల వారి వల్లే శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాణ్మూర్తిని దివ్యసాలగ్రామమూర్తిగా భావించడమే కాక తిరుమల దివ్యక్షేత్రం కూడా దివ్యసాలగ్రామమైన సాక్షాత్తుగా తిరుమల కొండే తిరుమలేశుడని, అందువల్లే వారు కూడా  మోకాళ్ళతోనే వేంకటాచలక్షేత్రాన్ని అధిరోహించినట్లు చెబుతారు. అంతేకాదు అన్నమాచార్యుల వారి చరిత్రలో కూడా ఇలా పొందుపరిచారట. మొట్టమొదట పాదరక్షలతో తిరుమల కొండను ఎక్కుతూ అలసి, కళ్ళుకనపడక, కాళ్ళు ముందుకు సాగక చతికిలబడిన అన్నమయ్యతో సాక్షాత్తు శ్రీ వేంకటేశుని పట్టపురాణి పద్మావతి అమ్మవారు ఉపదేశం చేశారట.
 
నీవు వేసుకున్న పాదరక్షలు తొలగిస్తే చాలా సులువుగా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చని చెప్పారట. ఆ తరువాత అలిమేలుమంగ అనుజ్ఞతో తిరుమల కొండ చేరుకున్నాడట అన్నమయ్య. సాక్షాత్తు సాలగ్రామమైన శ్రీ వేంకటాచలక్షేత్రంలో ఓం సాలగ్రామ నివాసాయ నమః అని నిత్యమూ కీర్తింపడుతూ మనందరికి దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్న దివ్యసాలగ్రామమూర్తి మీరూ కొలవండి.. గోవిందా...గోవిందా....