108 అడుగుల లక్ష్మీనరసింహ! ప్రపంచంలోనే పెద్దది!!
ప్రపంచంలోనే అతి పెద్దది అయిన 108 అడుగుల ఎత్తయిన లక్ష్మీ నరసింహ విగ్రహాన్ని కృష్ణా జిల్లాలో ప్రతిష్ఠించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం దీనికి వేదిక అయింది. అనితర సాధ్యంగా 108 అడుగుల ఎత్తయిన లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన అంగ రంగ వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు మంత్రోఛారణతో స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు.
ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లలిత కామేశ్వరి పీఠం స్వామీజీ శ్రీ ఆదిత్య ఆనంద భారతి స్వామి హాజరయ్యారు. దేశం నలుమూలల నుండి విరాళాలతో ఏ ఎస్ ఎం సి సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుక చూసేందుకు తరలి వస్తున్నారు. అయితే, కరోనా కారణంగా కమిటీ వారు నియమ నిబంధనలు పాటిస్తూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శిల్పులు ఈ 108 అడుగుల భారీ విగ్రహాన్ని అంత్యంత నైపుణ్యంగా తయారు చేశారు. దేశంలోగాని, మరెక్కడా గాని ఇంత పెద్ద లక్ష్మీ నరసింహ విగ్రహం లేదని వేద పండితులు తెలిపారు.