శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (22:34 IST)

కన్నులపండువగా ధ్వజారోహణం, సర్వదేవతలను....

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితులవేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
 
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య  మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్ధంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమూర్తులను, రుషిగణాన్ని, సకల ప్రాణకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్ ధ్వజస్ధంభాన్ని అధిరోహిస్తారని ప్రాశస్త్యం.
 
విశ్వమంతా గరుడుడు వ్యాపించి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన్ను శ్రీనివాసుడు వాహనంగా చేసుకోవడంతో సర్వాంతర్యామిగా స్వామివారు కీర్తించబడుతున్నారు. కాగా ధ్వజపటంపై గరుడునితో పాటు సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం సంప్రదాయం.
 
ఈ సంధర్భంగా పెసరపప్పు అన్నం, ప్రసాద వినియోగం జరిగింది. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్గాయుష్షు, సిరిసంపదలు చేకూరుతాయని విశ్వాసం. అదే విధంగా ధ్వజస్థంభానికి కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. పంచభూతాలు, సప్తమూర్తులను కలిపి 12మంది దీనికి అధిష్టాన దేవతలు. 
 
ఇది సకల దోషాలను హరిస్తుంది. దర్భను కోసేటప్పుడు కైంకర్యాల్లో వినియోగించేటప్పుడు ధన్వంతరి మంత్ర పారాయణం చేస్తారు. ధ్వజారోహణం అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు.
 
ధ్వజారోహణ ఘట్టానికి ముందుకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రతాళ్వార్, సేనాధిపతి వారిని ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనుండగా ఏకాంతంగానే వాహనసేవలు జరుగనున్నాయి.