గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:21 IST)

ఏడాదిన్నరలో చెన్నైలో అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం: టీటీడీ చైర్మన్

ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా త్వరలో కళ్యాణమస్తు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం చెన్నైలో శంఖుస్థాపన చేసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తి చేయడం లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.
 
చెన్నై జిఎన్ చెట్టి వీధిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం నిర్వహించిన శంఖుస్థాపన, తమిళనాడులో గుడికో గోమాత ప్రారంభ కార్యక్రమాల్లో చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద కుటుంబాలు పెళ్ళి ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇలాంటి వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వివాహాలు జరిపించడానికి టీటీడీ దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో కళ్యాణమస్తు (సామూహిక వివాహాలు) నిర్వహించనుందన్నారు.
 
మంచి ముహూర్తం నిర్ణయించి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. వివాహాలు చేసుకునే జంటకు పట్టు వస్త్రాలు, మంగళ సూత్రాలు ఇవ్వడంతో పాటు వివాహ విందు భోజనం కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసంలో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో అమలు జరుగుతోందన్నారు.
 
శనివారం కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా తమిళనాడులో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 8 ఆలయాలకు గోవు, దూడ అందించామన్నారు. వీటి పోషణ ఆ  ఆలయాలే చూసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ఆలయాలు, వేద పాఠశాలలు, మఠాలు, పీఠాలు ముందుకొస్తే గోవు, దూడ అందిస్తామని చైర్మన్ చెప్పారు.
 
చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం గత ఏడాదిలోనే జరగాల్సి ఉందని, కోవిడ్ వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 6.85 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారన్నారు. ఇందులో టీటీడీ రూ. 5.85 కోట్లు భరిస్తుందన్నారు, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందిస్తారని చైర్మన్ చెప్పారు.
సినీనటి కుమారి కాంచనతో పాటు వారి కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన భూమి విలువ రూ.40 కోట్ల దాకా ఉంటుందని ఆయన వివరించారు. వీరి కుటుంబానికి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి దేవి ఆశీస్సులు లభించాలని ఆయన ప్రార్థించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, ఏడాదిన్నరలోగా పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జమ్మూ, ముంబైలో శ్రీవారి ఆలయాలు నిర్మించబోతున్నామన్నారు.
 
కన్యాకుమారి లోని శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం ఈసిఆర్ రోడ్, ఓఎంఆర్ రోడ్ లో 10 ఎకరాల భూమి కేటాయించడానికి అంగీకరించిందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు రెండు చోట్ల భూమి పరిశీలించి ఆలయ నిర్మాణానికి ఏది అనుకూలమో నిర్ణయించాక ఇతర ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో చైర్మన్‌తో పాటు టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, చెన్నై సలహామండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.