ఆ గుడి గోపురంపై సుదర్శనచక్రం.. ఎటు తిరిగినా మీవైపే తిరుగుతుంది...

సందీప్ రేవిళ్ల| Last Modified సోమవారం, 18 మార్చి 2019 (18:33 IST)
ప్రతి ఏడాది లక్షల మంది భక్తలు సందర్శించే పూరీ జగన్నాథ్ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గణగణ మ్రోగే గంటలు, 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, కృష్ణుడి జీవితాన్ని కళ్లకుకట్టినట్లు వివరంగా చూపించే స్థంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకువస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర చాలా విశిష్టమైనది. ఈ ఆలయం ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలో ఉంది.

1077లో పూరీలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అన్ని ఆలయాల్లో లాగానే ఈ అలయంలో కూడా గోపురం, దేవుడు, ప్రసాదం, గంటలు ఉన్నప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైనది. జగన్నాథుడు కొలువైన ఈ ఆలయంలో ప్రతిదీ వింతగానే కనిపిస్తుంది. దీని గురించి మీకు ఆసక్తి కలిగించే అనేక విషయాలు ఉన్నాయి.

ఏ గుడికి కట్టిన జెండాలైనా సాధారణంగా గాలి ఎటువైపు ఉంటే అటువైపుకు వీస్తాయి కానీ ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా విచిత్రంగా గాలి దిశకు వ్యతిరేకంగా రెపరెపలాడుతుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ గోపురం పైన ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు పూరీలో ఎక్కడి నుండైనా నిలబడి చూసినట్లయితే అది మీ వైపుకు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. తీరప్రాంతాల్లో సాధారణంగా పగటి పూట గాలి సముద్రంపై నుండి భూమి వైపుకు ఉంటుంది. సాయంత్రం గాలి భూమిపై నుండి సముద్రం వైపుకు ఉంటుంది.

కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేక దిశలో గాలి వీస్తుంది. పక్షులు జగన్నాథ ఆలయం పైన అస్సలు ఎగరవు. దానికి కారణం ఏమిటో ఇంత వరకూ అంతు చిక్కలేదు. పూరీ జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఏమాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా, రోజులో ఏ సమయంలోనైనా నీడ మాత్రం అస్సలు కనిపించదు. ఇది నిర్మాణంలోని గొప్పదనమో లేక దేవుని లీలో తెలియదు.

పూరీ జగన్నాథ ఆలయంలో తయారుచేసే ప్రసాదాన్ని ఎవ్వరూ వృధా చేయరు. అలల శబ్దం సింహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క అడుగు లోపల పెట్టగానే సముద్రం నుండి వచ్చే శబ్దం అస్సలు వినిపించదు. బయట అడుగు పెట్టగానే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అయితే సాయంత్రం ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. ఆలయంలోని సోదరి సుభద్రా దేవి ప్రశాంతత కావాలని కోరడం వల్లే ఇలా జరుగుతుందని నమ్మకం. పూరీ జగన్నాథ రథయాత్రకు రెండు రథాలు లాగుతారు.

శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్ళను నది వరకు తీసుకెళ్తుంది. ఆ తరువాత 3 చెక్క పడవల్లో దేవతలను నది దాటిస్తారు. అక్కడి నుండి మరో రథం దేవుళ్ళను గుండిజా ఆలయానికి తీసుకెళుతుంది. పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడు విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు వుంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. రథయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చి తాళ్లను లాగటంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేసారు. శ్రీ కృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రతి సంవత్సరం రథ యాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీజా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తనంతట అదే ఆగిపోతుంది. సాయంత్రం 6 గంటల తరవాత ఆలయం తలుపులు మూసేస్తారు. పూరీ జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలన్నింటినీ సాంప్రదాయ ప్రకారం ఆలయ వంటశాలలోని మట్టి కుండలలో చేస్తారు. ప్రసాదాన్ని దేవుడికి సమర్పించక ముందు దానికి ఎలాంటి వాసన రుచి ఉండదు. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాల నుండి ఘుమఘుమలాడే వాసనతోపాటు రుచి కూడా వస్తుంది.దీనిపై మరింత చదవండి :