శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2016 రౌండప్
Written By chj
Last Modified: బుధవారం, 28 డిశెంబరు 2016 (15:12 IST)

ఆ విషయంలో అర్థ సెంచరీ పూర్తి చేసిన ప్రధాని మోదీ... ఇక్కడ సెంచరీ దాటింది... జనం ఇంకా రోడ్ల మీదే...

ప్రధాని మోదీ ఏదైతే నంబర్ చెప్పి జనాన్ని ధైర్యంగా ఉండమంటున్నారో ఆ రోజు వచ్చేసింది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ఇవాళ్టితో 50 రోజులు పూర్తవుతున్నాయి. గత నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను బ్యాంకు

ప్రధాని మోదీ ఏదైతే నంబర్ చెప్పి జనాన్ని ధైర్యంగా ఉండమంటున్నారో ఆ రోజు వచ్చేసింది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ఇవాళ్టితో 50 రోజులు పూర్తవుతున్నాయి. గత నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. 50 రోజులు పాటు కాస్త ఓపిక పట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు దేశ ప్రజలకు తమ ప్రసంగాలతో పిలుపునిచ్చారు. 
 
ఈ 50 రోజులు ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. పంటలు చేతికొచ్చే సమయంలో కేంద్ర తీసుకున్ననోట్ల రద్దు నిర్ణయం రైతులను - రైతు కూలీలను చాలా ఇబ్బందులకు గురి చేసింది. అమ్మిన పంటకు నగదు లభించక, కొత్త పంటలు వేసేందుకు డబ్బు లేక సతమతమవుతున్నారు. అడ్డా కూలీలకు పని లేదు. మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, గర్భణీలు బ్యాంకుల ముందు, ఏ.టి.యమ్‌ల ముందు పడిన బాధలు అన్నీఇన్నీ కాదు. క్యూ లైన్లలోనే పండుటాకులు రాలిపోయాయి. తోపులాట్లలో అనేకమందికి గాయాలయ్యాయి.
 
కొత్త నోట్ల కొరతతో ప్రజలు, చిన్న వ్యాపారుల అవస్తలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొత్త నోట్ల కొరత వల్ల చాలా వ్యాపారాల్లో క్రయవిక్రయాలు 30 నుంచి 40 శాతం దాకా పడిపోయాయి. నగదు ఇప్పట్లో వచ్చేలా లేదని కొందరు వ్యాపారులు బ్యాంకు అధికారుల వెంటపడి మరీ స్వైపింగ్‌ యంత్రాలు తీసుకుంటున్నారు. మరికొందరు చెక్‌లు తీసుకుని అమ్మకాలు జరుపుతున్నారు. అప్పులపై సరకులు తెచ్చి అమ్మేవారు వ్యాపారం సాగక అప్పులు, వాటిపై వడ్డీలు ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కూలీలు, హమాలీలకు పూట గడవడం కష్టంగా మారింది. 
 
ప్రతి దినం ఏ.టి.యమ్., బ్యాంకుల ముందు నిలబడటమనేది దైనందిన జీవనంతో భాగమైపోయింది. శుభ - అశుభ కార్యాలు చేసుకునేవారు, అకస్మాత్తుగా ఆసుపత్రులలో చేరిన వారు, ఆపరేషన్లు త్వరితగతిన చేయించుకోవాల్సి వాళ్ళు పడిన యాతనలు వర్ణనాతీతం. బ్యాంకులలో నగదు తీసుకోవడానికి 24 వేలు గరిష్ట పరిమితిని కేంద్రం విధించింది. కానీ బ్యాంకులు 4 వేలు కంటే ఎక్కువ ఇవ్వలేమని ప్రకటించడం, ఏ.టి.యమ్.ల ముందు ప్రజలు అర్థరాత్రులు పడిగాపులు గాయడం, పృద్ధాప్య పెన్షన్లు కూడా బ్యాంకు నుండే తీసుకావాల్సిరావడంతో మంచం పట్టిన వృద్ధులు - వికలాంగులు బ్యాంకుల ముందు క్యూలలో నుంచొని అల్లాడిపోవడం లాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.
   
ఈ 50 రోజులలో వేల కోట్ల నల్ల ధనాన్ని వెలికి తీస్తామని ధీమాగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఒక్క శేఖర్ రెడ్డిని తప్ప మరే బడా బాబులను పట్టుకోలేకపోయింది. రోజులు గడుస్తున్నకొద్దీ నగదు కష్టాల ఊరట సంగతి అటుంచి నగదు రహిత లావాదేవీలే తమ ప్రధాన ధ్యేయమని ప్రధాని ప్రకటించడం చూస్తుంటే చిల్లర కష్టాలు ఈ దరిదాపుల్లో తీరవనే భయం కలుగుతుంది. నగదు రహిత లావాదేవీలు కాలానుగుణంగా అలవాటు చేయాలే తప్ప ఉన్న ఫళంగా భారతీయ సమాజంలో అమలు చేసే అవకాశం లేదని చాలామంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
కిరాణా దుకాణం, ఆసుపత్రి, హోటల్‌, మందుల దుకాణం.. ఇలా ఎక్కడికెళ్లినా చిల్లర సమస్యే. రూ.1000 వరకు బిల్లు చేస్తేనే 2 వేల నోటు అంగీకరిస్తామని చెప్పడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. చిల్లర కష్టాలు అధిగమించేందుకు కొందరు స్వైపింగ్‌ యంత్రాలు తీసుకుంటున్నారు. వాటికి గిరాకీ పెరగడంతో బ్యాంకులు కొంత గడువు కోరుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రైవేటు సంస్థలు యాప్‌ ఆధారిత పీవోఎస్‌లు అందిస్తున్నాయి. వాటికి రూ.100 బిల్లుపై రూ.1.30 ఛార్జీ కింద చెల్లించాలని సూచిస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి, ప్రజలు అలవాటు పడటానికి చాలా సమయమే పడుతుంది. 
 
ఇకనైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల చిల్లర కష్టాలను తీర్చే దిశగా ఆలోచనలు చేయాలి. పేద, మధ్య తరగతి ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఒకచేత్తో బడా బాబులపై కొరడా ఝళిపిస్తూనే, మరో చేత్తో ఆర్థిక రంగంలో ఉద్దీపనకు చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక, సామాజిక రంగాలపై పూర్తి పట్టుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆర్థిక రంగాన్ని పూర్తిగా తన పట్టులోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. 
 
అసలు బ్యాంకుల ముందు గానీ, ఏ.టి.యమ్. సెంటర్ల ముందుగానీ ఒక్క ధనవంతుడు నుంచొని కనిపించిన దాఖలాలు లేవు. బ్యాంకుల ముందు ఏ.టి.యమ్.ల ముందు పేద, మధ్య తరగతి ప్రజలే తప్ప ధనికులు నుంచోవడం లేదు. ఐతే ఈ విషయంలో భారతీయ ప్రజల సహనాన్ని ప్రశంసించాల్సిందే. నోట్ల రద్దు వల్ల కలిగిన ఇబ్బందులను పంటి బిగువునే భరిస్తూ ఈ 50 రోజులు ప్రజలు ఓపికగా ఉన్నారు. ప్రధాని చెప్పిన మార్పులు దేశంలో సాకారం అవుతాయనే నమ్మకంతో ఇవన్నీ భరించారు. రానున్న రోజుల్లో వారి జీవితాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకోకుండా, ఇదే పరిస్థితే కొనసాగితే ప్రజల సహనం నశించే ప్రమాదం లేకపోలేదు. మోదీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు మోదీ ప్రస్తుతం పులి మీద స్వారీ చేస్తున్నారు. మరి ఆ స్వారీ ఆయన ఎలా విజయవంతం చేసుకుంటారో కాలమే చెపుతుంది.