జైట్లీ వ్యాఖ్యలు... లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బాంబే స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 25,642కి పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7,664కి చేరుకుంది. వాస్తవానికి మలేషియా విమాన ప్రమాదం దుర్ఘటన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లన్నీ నిరాశాజనకంగానే ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
అయితే బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడుతూ... భారతీయ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో మార్కెట్లలో చలనం వచ్చింది. ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేయడంతో చివరకు లాభాల్లో ముగిశాయి.
ఈ ట్రేడింగ్‌లో ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, కర్ణాటక బ్యాంక్, ఐడీఎఫ్‌సీ షేర్లు లాభాలను అర్జించగా, ఇండియన్ హోటల్స్, జీఎంఆర్ ఇన్ ఫ్రా, ఆర్ఈసీ, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, హెచ్‌పీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో పయనించాయి.