స్టాక్ మార్కెట్ : లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

pnr| Last Updated: గురువారం, 17 డిశెంబరు 2015 (17:49 IST)
దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం సూచీలన్నీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికా మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఆ ప్రభావం భారతీయ స్టాక్‌ మార్కెట్లపైనా పడింది. దీంతో గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు మధ్యలో కొంత ఊగిసలాటకులోనైనా త్వరగా తేరుకుని లాభాల దిశగా పయనించాయి.

సెన్సెక్స్‌ 309 పాయింట్లు లాభపడి 25,803 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 7,844 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి రూ.66.51 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో టాటా స్టీల్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 5.23శాతం లాభపడి రూ.257.50 వద్ద ముగిశాయి.

వీటితోపాటు టాటా పవర్‌, హిందాల్కో, వేదాంత, రిలయన్స్‌ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బాష్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.07శాతం నష్టపోయి రూ.18,330 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐడియా, కెయిర్న్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ సంస్థల షేర్లు సైతం నష్టాలతో ముగిశాయి.దీనిపై మరింత చదవండి :