శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (11:00 IST)

భళా భజరంగ్.. భారత్‍కు తొలి స్వర్ణం ... భారతరత్న వాజ్‌పేయికి అంకితం

ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా సాగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం వచ్చి చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 65కిలోల ప్రీస్టైల్ విభాగం ఫైనల్లో బజ్‌రంగ్ 11-8 తేడాతో తకాతనీ దైచీ

ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా సాగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం వచ్చి చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 65కిలోల ప్రీస్టైల్ విభాగం ఫైనల్లో బజ్‌రంగ్ 11-8 తేడాతో తకాతనీ దైచీ(జపాన్)పై గెలుపు ఢంకా మోగించాడు.
 
తొలుత 6-0తో పూనియా ముందంజ వేసినా.. ఒక్కసారిగా పుంజుకున్న జపాన్ రెజ్లర్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పూనియాకు దీటైన పోటీనిస్తూ పాయింట్లు కొల్లగొట్టాడు. అయితే తన శక్తినంతా కూడదీసుకుంటూ జపాన్ రెజ్లర్ ఎత్తులను బజ్‌రంగ్ చిత్తుచేశాడు. 
 
ఏ మాత్రం అవకాశమివ్వకుండా కీలక పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాయింట్ల మధ్య అంతరం ఒకింత తగ్గినా ఒత్తిడికి లోనుకాకుండా తొలి రౌండ్‌లో 2-2-2తో ఆరు పాయింట్లు, రెండో రౌండ్‌లో 2-2-1తో ఐదు పాయింట్లు దక్కించుకున్నాడు.
 
ఈ విజయం తర్వాత భజరంగ్ పూనియా స్పందిస్తూ, ఈ విజయాన్ని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి అంకితమిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నాను. యోగీ బాయ్(యోగేశ్వర్ దత్) చెప్పినట్లుగానే ఈ ఆసియాడ్‌లో స్వర్ణం గెలిచాను. ఇది నా కెరీర్‌లోనే మరుపురాని పతకం. ఇక్కడ విజయం సాధిస్తే రానున్న టోక్యో(2020)లో పోటీలో ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఇదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ నసాగించాలనుకుంటున్నాను. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా మరింత సిద్ధమవుతాను అని చెప్పుకొచ్చాడు.