శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (11:40 IST)

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : జులానా స్థానం బరిలో వినేశ్ ఫొగాట్!

vinesh phogat
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే జులానా అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో వినేశ్ ఫోగాట్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇదేసమయంలో మరో రెజ్లర్ బజరంగ్ పునియాకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పింది.
 
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు ముందుగా భారత రైల్వేలో తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు వీరు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మరో పక్క వీరు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అధికార బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.