మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (10:13 IST)

డిస్కస్ త్రోలో భారత్‌కు మరో పతకం : మెరిసిన యోగేష్

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం మూడు పతకాలను సాధించిన భారత ఆటగాళ్లు సోమవారం మరో రెండు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. వీటిలో ఒకటి బంగారం పతకం కావడం గమనార్హం. రెండోది రజత పతకం. 
 
సోమవారం భారత షూటర్ అవనీ లేఖర దేశానికి తొలి స్వర్ణ పతకం అందించగా, తాజాగా డిస్కస్‌త్రోలో యోగేశ్ కతునియా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో రజత పతకం అందించాడు. 44.38 మీటర్లు విసిరి ఈ సీజన్‌లోనే బెస్ట్ సాధించాడు. 
 
24 ఏళ్ల యోగేశ్ ఈ కేటగిరీలో ప్రపంచ నంబర్ 2గా కొనసాగుతున్నాడు. బ్రెజిల్ క్రీడాకారుడు క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
 
అలాగే, జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. దేవేంద్ర జజారియా రజత పతకం గెలుచుకోగా, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు సొంతమయ్యాయి. 
 
కాగా, ఆదివారం డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించినప్పటికీ ఈ విషయంలో సోమవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. ఇది కూడా కలిస్తే భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకున్నట్టే. పారాలింపిక్స్‌లో భారత్ ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి.