సింగిల్ లెగ్ కుర్రోడు అదరగొట్టాడు.. పారాలింపిక్స్‌లో స్వర్ణం
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ సింగిల్ లెగ్ కుర్రోడు అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రతి ఒక్కరితో ఔరా అనిపించుకున్నాడు.
ఎస్ఎల్-3 (సింగిల్ లెగ్) ఫైనల్లో స్వర్ణం కోసం జరిగిన పోరులో ప్రమోద్ భగత్ 21-14, 21-17తో బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌పై ఘనవిజయం నమోదు చేశాడు.
ప్రమోద్ భగత్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో వరల్డ్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన ఫైనల్లో తన టాప్ ర్యాంకుకు తగిన ఆటతీరు ప్రదర్శించి భారత శిబిరంలో బంగారు కాంతులు నింపాడు.
మరోవైపు, ఈ పారాలింపిక్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. సోమవారం ఉదయం షూటింగ్‌లో స్వర్ణం, రజతం చేజిక్కించుకున్న భారత్, తాజాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లోనూ స్వర్ణం కైవసం చేసుకోవడం గమనార్హం.