తృటిలో మెడల్ మిస్సైంది.. ప్రధాని ట్వీట్.. రూ.50 లక్షల నజరానా
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో భారత్ మహిళా జట్టు ఓడింది. కానీ, అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కోట్లాది మంది మనసులను గెలుచుకున్నారు.
దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. మహిళల హాకీ జట్టు ప్రదర్శనను ఎన్నటికీ మరువలేమన్నారు. మ్యాచ్ ఆద్యంతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించారని, జట్టులోని ప్రతి ప్లేయర్ అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. భారత జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నారు. తృటిలో మహిళల హాకీ జట్టు మెడల్‌ను మిస్సైనట్లు ఆయన తన ట్వీట్‌లో చెప్పారు.
భారత హాకీ జట్టులో ఉన్న మహిళా ప్లేయర్లకు హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ప్రస్తుతం టోక్యోకు వెళ్లిన హాకీ జట్టులో 9 మంది హర్యానా అమ్మాయిలే ఉన్నారు. అయితే ప్రతి ప్లేయర్‌కు రూ.50 లక్షల క్యాష్ అవార్డు ఇవ్వనున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.