శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:42 IST)

ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి రూ.5 లక్షలు ఫ్రీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తున్నాయి. ఇందులోభాగంగా, కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ హామీ ఇచ్చింది. ఇంటి స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ఈ మొత్తం రూ.6 లక్షలుగా ఉంటుందని ప్రకటించింది. 
 
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి అప్పులేని నగదు ఇస్తామని పేర్కొంది. అయితే, డిసెంబర్ 2వ తేదీన ఆదివారం ప్రధాన పత్రికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటన కొంత గందరగోళానికి గురిచేసింది. 
 
ఆ ప్రకటనలో పేదవారికి రూ.5 లక్షల రుణం… ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల రుణం ఇస్తామని ఉంది. దీంతో.. కాంగ్రెస్ మాట మార్చిందంటూ అధికార పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే, పేపర్లో ప్రకటన తప్పుగా వచ్చిందంటూ వివరణ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తాము పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. 
 
దీనిపై సోమవారం డిసెంబర్ 3వ తేదీన ప్రధాన పత్రికల్లో 'ఉచితం' అనే మాటతో సవరించిన ప్రకటన వచ్చింది. ఈ సవరించిన ప్రకటన ప్రకారం.. ఇంటి స్థలం ఉన్న పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఉచితంగా ఇస్తామని… ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల మొత్తాన్ని ఉచితంగానే ఇస్తామని టీ పీసీసీ వెల్లడించింది.