గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (10:37 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కామారెడ్డి

telangana assembly poll
తెలంగాణ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో కామారెడ్డి ఒకటి. ఈ స్థానం ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పోటీ చేస్తున్నారు. ఇది ఆయన పోటీ చేస్తున్న రెండో స్థానం కావడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రేసులో ఉంటానని ప్రకటించారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దించారు. 
 
గత 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్ధన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ చేయగా, గోవర్ధన్‌ విజయం సాధించారు. గోవర్ధన్ 4,557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్ధన్‌కు 68,162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63,610 ఓట్లు వచ్చాయి. గోవర్ధన్ బీసీలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు. గతంలో టీడీపీ మాజీ నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ చెంతన చేరారు. అప్పటి నుంచి వరుసగా గెలుస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది.
 
టీడీపీ పక్షాన రెండుసార్లు, టిఆర్ఎస్ తరపున మూడుసార్లు గెలిచారు. కాగా కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణా రెడ్డికి 15వేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్ రెండువేల తొమ్మిదిలో టీడీపీ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కామారెడ్డిలో నాలుగుసార్లు రెడ్డి నేతలు, తొమ్మిదిసార్లు బిసిలు, రెండుసార్లు ఎస్.సిలు గెలవగా, మూడుసార్లు ముస్లింలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కామారెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు టిఆర్ఎస్ మూడుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. టి.ఎన్. సదాలక్ష్మి ఇక్కడ ఒకసారి, ఎల్లారెడ్డిలో మరోసారి గెలిచారు.
 
సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, షబ్బీర్ అలీ 1990లో చెన్నారెడ్డి, 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి, 2004 నుంచి ఐదేళ్లపాటు వైఎస్.రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. తదుపరి ఒకసారి ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా షబ్బీర్ ఉన్నారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999లో టిడిపి తరుఫున గెలిచిన యూసఫ్ అలీ విప్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. గంపా గోవర్ధన్ కూడా విప్
అయ్యారు.
 
2018 ఎన్నికల ఫలితాలు 
గంప గోవర్ధన్ 68167 (తెరాస) 
అలీ షబ్బీర్ 63610 (కాంగ్రెస్) 
కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15439 (బీజేపీ) 
గోవర్దన్ ఎం 10537 (ఎస్ఎంఎఫ్‌బి) 
నోటా 1471 
కొత్తపల్లి మల్లయ్య 791(బీఎస్పీ) 
పుట్టా మల్లికార్జున్ 699 (బీఎల్ఎఫ్పీ) 
అర్రోల నవీన్ 601 (ఇండిపెండెంట్) 
దుడుగు పాండురంగం 562 (ఏఏఏపీ) 
కె కిషన్ 351 (ఇండిపెండెంట్)