శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: గురువారం, 29 నవంబరు 2018 (14:58 IST)

పోలీసులను అల్లాడించిన గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి

గోషామహాల్ నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థిని చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రముఖి ఆచూకీని తిరుపతిలో ఉన్నట్టు గుర్తించి.. ఆమెని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నేడు  హైకోర్టులో చంద్రముఖిని హాజరుపర్చనున్నారు పోలీసులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి మూడ్రోజుల క్రితం అనూహ్యంగా అదృశ్యమైంది. చంద్రముఖి అదృశ్యంపై అనుమానాలు లేవనెత్తారు మిగతా హిజ్రాలు, బంధువులు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. 
 
చంద్రముఖిని కిడ్నాప్ చేశారని.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు బంధువులు. విచారణ చేపట్టిన పోలీసులు దారిపొడవునా సీసీటీవీలను పరీక్షించారు. చంద్రముఖి వెళ్లేటప్పుడు ఓ సీసీ కెమెరాలో రికార్డైంది. ఒంటరిగా తనంతట తానుగా చంద్రముఖి వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది. దాంతో చంద్రముఖిది కిడ్నాప్ కానేకాదని.. మిస్సింగ్ మాత్రమేనని పోలీసులు గుర్తించారు. 
 
ఇంతలో చంద్రముఖి ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు ఆమె బంధువులు. దాంతో ఆఘమేఘాలమీద ఆమె కోసం ప్రత్యేక పోలీసు టీమ్‌లను రంగంలోకి దింపి.. ఆచూకీని తిరుపతిలో కనుక్కున్నారు. తిరుపతికెళ్లి అక్కడ చంద్రముఖిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు రాత్రి తీసుకొచ్చారు. అంతలో ఆమె న్యాయవాది కూడా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. 
 
మిస్సింగ్ అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లావని పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె లాయర్ జోక్యం చేసుకుని.. అదంతా కోర్టులోనే చెప్తామని అనడంతో పోలీసులు ఆమెని హోంకు పంపారు. పబ్లిసిటీ స్టంట్ కోసం చంద్రముఖి ఈ డ్రామా ఆడినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. కావాలనే వెళ్లిపోయి.. కిడ్నాప్ అయిందంటూ తమను ముచ్చెమటలు పట్టించిందని వాపోతున్నారు పోలీసులు.