శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (14:21 IST)

రూ.100 ప్రామిసరీ నోటుపై నెరవేర్చే హామీలు రాసిచ్చిన బీజేపీ అభ్యర్థి

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రచారానికి వచ్చే అభ్యర్థులు రోడ్డు, తాగు, సాగునీరు కల్పిస్తామంటూ బాండు పేపర్‌పై రాసివ్వాలని లేనిపక్షంలో తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దంటూ స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మరోమార్గం లేక ప్రామీసరి నోటుపై సంతకం చేశారు. ఆ అభ్యర్థి పేరు కొయ్యల ఏమాజీ. ఈయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 
 
ఈయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి కొయ్యల ఏమాజీ వెళ్లారు. ప్రచారానికి వచ్చే అభ్యర్థులు రోడ్డు, తాగు, సాగునీరు కల్పించాలని బాండ్‌ పేపర్‌పై హామీ ఇవ్వాలని, లేని పక్షంలో గ్రామంలోనికి రానివ్వమని గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
కోనంపేట గ్రామానికి ప్రచారం కోసం సోమవారం ఏమాజి వచ్చారు. అక్కడి యువకులు గ్రామ పొలిమేరలోనే అడ్డుకున్నారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఏమాజీ కోరారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే నమ్ముతామని ప్రజలన్నారు. బీటీ రోడ్డు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడతానని వంద రూపాయల ప్రామిసరీ నోటుపై ప్రజల సమక్షంలో సంతకం చేశారు.