మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (10:36 IST)

సాయుధ పోరాటనికి ఊతమిచ్చిన స్థానం జనగామ రౌండప్

telangana assembly
తెలంగాణ సాయుధ పోరాటానికి ఊతమిచ్చిన ప్రాంతం... పోరాటాలపరంగా, ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా చరిత్ర కలిగిన నేల జనగామ నియోజకవర్గం. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రకెక్కిన వీర బైరాన్‌పల్లి జనగామ నియోజకవర్గం సొంతం. కళ్ల ముందు మాన ప్రాణాలు పోతున్నా... యుద్ధ పోరాట పంథాను విడవని ఇది. నిత్యం చైతన్య స్ఫూర్తిని కలిగి ఉండే జనగామ ప్రాంతం రాష్ట్ర స్థాయిలో, ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. 2009కు ముందు రెండుగా ఉన్న చేర్యాల, జనగామ నియోజక వర్గాలు ఆ తర్వాత జరిగిన పునర్విభజనలో ఒకటే నియోజకవర్గంగా మారిపోయాయి, పాత చేర్యాల, జనగామ నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించిన కమాలుద్దీన్ అహ్మద్, ఏసీరెడ్డి, నర్సింహా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలంతా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఒక వెలుగు వెలిగారు.
 
2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చేర్యాల నియోజకవర్గాన్ని రద్దు చేసి జనగామ నియోజకవర్గంలో విలీనం చేశారు. అదేసమయంలో జన గామ నియోజకవర్గంలో ఉన్న రఘునాథపల్లి, లింగాల ఘణపురం మండలాలను స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో, దేవరుప్పులను పాలకుర్తి నియోజకవర్గంలో కలిపారు. జనగామ నియోజకవర్గంలో జనగామ పట్టణం, జనగామ మండలం మాత్రమే మిగిలి ఉండగా, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలతో కూడిన పూర్తి నియోజకవర్గాన్ని జనగామలో కలిపారు. 1952లో జనగామ నియోజకవర్గం ఏర్పడగా, 1957లో చేర్యాల నియోజకవర్గం ఏర్పాటైంది. పునర్విభజన తర్వాత చేర్యాల నియోజకవర్గం కనుమరుగై జనగామలో కలిసిపోగా అప్పటి నుంచి జనగామ నియోజకవర్గంగా కొనసాగుతోంది. 
 
జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఇందులో హ్యాట్రిక్ సాధించారు. మొదటిసారిగా 1985లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన.. సీపీఎం అభ్యర్థి ఏసీ రెడ్డి... నర్సింహా రెడ్డిపై చెందారు. ఆ తర్వాత 1989లో సీపీఎం అభ్యర్థి చారగొండ రాజారెడ్డిపై తొలిసారిగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009లో గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇదేసమయంలో ఆయన వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, ఐటీ శాఖ మంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విజయాలు అందించిన నియోజకవర్గం జనగామ. 
 
1952లో ఏర్పాటు కాగా, అప్పటినుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీనే విజయాలు వరించాయి. 16సార్లు ఎన్నికలు జరగగా 1957లో ద్విసభ స్థానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పనిచేశారు. మిగతా 15 ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఆ తర్వాత రెండు సార్లు సీపీఎం, రెండు సార్లు టీఆర్ఎస్, పీడీఎఫ్, సీపీఐ, టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. అటు చేర్యాల నుంచి 1962, ఇటు జనగామ నుంచి 1967లో గెలుపొందిన కమాలుద్దీన్ అహ్మద్ జాతీయ స్థాయి నేతగా ఎదిగాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టారు. సౌదీ ఆరేబియాలో భారత రాయబారిగా పనిచేశారు. 
 
2009కి పూర్వం చేర్యాల, మద్దూరు, నర్మెట, బచ్చన్నపేట మండలాలతో పాటు జనగామ మండలంలోని రెండు గ్రామాలు, రఘునాథపల్లి మండలంలోని మూడు గ్రామాలతో కలిసి చేర్యాల నియోజకవర్గంగా కొనసాగింది. 1957 నుంచి 2008 వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా, ఇందులో నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, రెండుసార్లు టీఆర్ఎస్, ఒకసారి సీపీఐ, ఒకసారి స్వతంత్ర గెలుపొందారు. టీడీపీ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచి నిమ్మ రాజిరెడ్డి హవా నడిపించారు. 
 
2018 ఎన్నికల ఫలితాలు... 
 
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 91592
లక్ష్మయ్య పొన్నాల 62024
లక్ష్మణ్ భీమ 10031
మేరుగు శ్రీనివాస్ 3604
కె.వి.ఎల్.ఎన్. రెడ్డి (రాజు) 3122
ఉడుత రవి యాదవ్ 2691
నోటా 2616 
శ్రీనివాస్ రెడ్డి శాకంపల్లి 1380 
కొత్తపల్లి సతీష్ కుమార్ 1018 
తుప్పతి సిద్దులు 619 
మహేందర్ రెడ్డి కొండేటి 593 
వెంకట రాజయ్య తాటికొండ 589 
ఉపేందర్ జెరిపోతుల 576 
మోహన్ రాజు అక్కలాదేవి 408 
మంతెన నరేష్ 395 
నిమ్మ జయరామ్ రెడ్డి 210