సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (12:15 IST)

నాంపల్లి పొలిటికల్ వార్... నువ్వానేనా అంటున్న అభ్యర్థులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాంపల్లి ఒకటి. ఇది మజ్లిస్ పార్టీ కంచుకోటల్లో ఒకటి. కానీ, ఈ దఫా మాత్రం గట్టి పోటీ నెలకొంది. ఫలితంగా ఈసారి ఫలితాలు ఏవిధంగా ఉంటాయన్నదానిపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. 
 
గత 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో నాంపల్లి అసెంబ్లీ స్థానం ఏర్పాటైంది. ఆ తర్వాత 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులే విజయభేరీ మోగించారు. ఈ దఫా కూడా ఇక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో మజ్లిస్ కేడర్ ఉంది. అయితే, ప్రజా కూటమి తరపున ఈ పార్టీకి గట్టిపోటీ ఎదురవుతోంది. 
 
ఈ కూటమి తరపున ముస్లిం వర్గానికే చెందిన ఫిరోజ్ ఖాన్ బరిలో ఉండటం, ఆయనకు స్థానికంగా మంచి పట్టువుండటంతో ఎంఐఎం అభ్యర్థి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. అయితే, ఈయన తొలిసారి ప్రజారాజ్యం నుంచి, రెండోసారి తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు మూడోసారి ప్రజా కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగానే బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
 
ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి. ఈ ఆరింటిలోనూ ఎంఐఎం అభ్యర్థులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అహ్మద్ నగర్, అసీఫ్ నగర్, రెడ్‌హిల్స్, మల్లేపల్లి డివిజన్లలో 70 శాతం మంది ముస్లింలే ఉన్నారు. విజయ్ కాలనీ, మెహిదీపట్నంలల హిందువులు 50 శాతం ఉన్నారు. అయితే, సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 3,03,497 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,58,641 మంది పురుషులు, 1,44,810 మంది స్త్రీలు, 46 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 
 
ఈ స్థానంలో ఎంఐఎం తరపున జాఫర్ హుసేన్ మిరాజ్ పోటీ చేస్తుండగా, ప్రజా కూటమి తరపున టీడీపీకి చెందిన ఫిరోజ్ ఖాన్, బీజేపీ తరపున దేవర కరుణాకర్, అధికార తెరాస పార్టీ తరపున ఆనంద్ కుమార్ గౌడ్‌లు బరిలో ఉన్నారు. ఈ నలుగురు అభ్యర్థుల మధ్యే నాంపల్లిలో తీవ్రమైన పోటీ నెలకొంది. విజయంపై ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.