పూర్తి మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు : అసదుద్దీన్ జోస్యం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తర్వాత తెరాస అధినేత కేసీఆర్ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తెరాస ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, సంపూర్ణ మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెరాస ప్రభుత్వంలో తాము చేరాల్సిన అవసరమే ఉండదన్నారు. పైగా, తమ అవసరం లేకుండానే తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
ఒకవేళ ప్రజా కూటమి విజయం సాధిస్తే మాత్రం మద్దతు ఇస్తామా లేదా అని విషయం ఇపుడే వెల్లడించలేమన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేయాలన్న దానిపై పార్టీ నేతలతు, ఎమ్మెల్యేలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అదేసమయంలో 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని చెప్పారు. తమ పార్టీని అణిచివేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయనీ అది ఎన్నిటికీ జరగదన్నారు. అలాగే, తమ పార్టీ మహిళా విభాగాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అసదుద్దీన్ వెల్లడించారు.