ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:48 IST)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా... అంచనాలకు మించిన ఫలితాలు...

congress flag
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. కామారెడ్డిలో పోటీ చేసిన సీఎం కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే వెనుకంజలో ఉన్నారు. 
 
అలాగే, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, జుక్కల్‌లో షిండే, శేరిలింగంపల్లిలో గాంధీలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మిగిలిన చోట్ల మాత్రం కాంగ్రెస్ అభ్యర్థు ముందంజలో ఉన్నారు. మరోవైపు, మునుగోడులో రెండో రౌండ్ ముగిసే సమయానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 
 
నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజలో ఉన్నారు. దేవరకద్రలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, హుస్నాబాద్‌‌లో పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో జీవన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2,380 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేలు ముందంజలో ఉన్నారు.
 
మరోవైపు, ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని సాధించారు. ములుగులో సీతక్క 3,500 ఓట్లతో ముందంజలో ఉండగా.. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్, సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు తమ ప్రత్యర్థుల కన్నా ముందున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసే సరికి 3,743 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లో ఉండగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి (2,738 ఓట్లు), మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి (1,370 ఓట్లు) నిలిచారు.