బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (13:23 IST)

కోహినూర్ గ్రూప్ ఎండీ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Money
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడింది. అయితే ఐటీ దాడులు మాత్రం ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం పాతబస్తీలోని బడా వ్యాపారులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. 
 
శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు అందుతున్నట్లు సమాచారం అందడంతో ఐటీ శాఖ దాడులు చేసింది. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. 
 
పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజీద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త షానవాజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 
 
కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
ఈ దాడుల్లో ఐటీ శాఖ అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ కూడా ఉన్నారు. పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.