మంత్రి మల్లారెడ్డికి షాక్.. అనుచరుల ఇళ్ళలో సోదాలు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. ఆయన అనుచరుల ఇళ్లలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. మల్లారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సంజీవ రెడ్డి ఇంట్లో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. సంజీవ రెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. గత నెల 30వ తేదీన బాన్సువాడ వేదికగా ప్రజాశీర్వాద సభ జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
స్టార్ కాంపెయినర్‌గా బాధ్యతాయుతమైనపదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొంది.
కాగా దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా, స్టానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14వ ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.