గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (21:39 IST)

రేవంత్ రెడ్డి ప్రస్థానం, కష్టించి అదృష్టంగా మార్చుకుని ముఖ్యమంత్రి పీఠంపై...

Revanth Reddy
Revanth Reddy
తెలంగాణ రెండో సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. డిసెంబర్ 7న గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. 
 
నాగర్ కర్నూల్ జిల్లా, కొండారెడ్డి పల్లిలో 1969 నవంబర్ 8వ తేదీన రేవంత్ రెడ్డి జన్మించారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఆపై వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి స్వతంత్రంగా ఎన్నికయ్యారు. 
 
2009లో టీడీపీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా, 2014లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-17 మధ్య తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన ఆయన 2017లో ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కి టీడీపీకి రాజీనామా చేశారు. 
 
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం కాగా, 2018లో కాంగ్రెస్ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయినా పట్టుదలను వదిలిపెట్టని రేవంత్ రెడ్డి 2019 మేలో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించారు. 
 
2021లో జూన్ 26న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అనే నినాదాన్ని లేవనెత్తి.. ప్రజల్లోకి వెళ్లారు. 
 
ఆయన పట్టుదల, అవిరళ కృషికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల ఫలితాల ద్వారా పట్టం కట్టారు. ఇందులో భాగంగా 2023 డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.