నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...
పిల్లల చదువులు సంగతి ఏమోగానీ పెద్దల జీతాలు, జీవితాలు బండలవుతున్నాయి. రేయనక పగలనక శ్రమించి కష్టపడి సంపాదించిన డబ్బునంతా పిల్లల చదువు రూపంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లు గద్దల్లా ఎగరేసుకుపోతున్నాయి. హైదరాబాదులోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీలో పిల్లవాడిని చేర్పించేందుకు వెళితే... మొత్తం కలిపి రూ. 2,51,000 వసూలు చేసారట. పైగా తాము చెప్పే విద్యా విధానం అత్యున్నత స్థాయిలో వుంటుందనీ, ఐఐటీ, ఐఏఎస్ వంటివి తమ స్కూల్లో చదివిన వారికి నల్లేరు మీద నడకలా వుంటుందని సెలవిస్తున్నారట.
అంతేకాదు... ఒకేసారి అంత ఫీజు మొత్తాన్ని చెల్లించలేని తల్లిదండ్రులకు స్కూళ్లు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాయి. ఫీజు మొత్తాన్ని గృహరుణాలకు EMIలు కట్టుకున్నట్లుగా ప్రతి నెలా రూ. 21,000 EMI రూపంలో చెల్లించుకోవచ్చని అవకాశాలు ఇస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు. చదువును EMIల్లో కొనుగోలు చేయాల్సి వస్తుందన్నమాట అంటూ సెటైర్లు వేస్తున్నారు.