క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు
ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం కొందరు విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ కూడా వున్నాడు. అందరూ ఎంతో హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు.
ఫీల్గింగులో భాగంగా వినయ్ బంతి కోసం పరుగులు తీస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. దీనితో మిగిలినవారంతా అతడి వద్దకు వెళ్లి చూసి ముఖంపై నీళ్లు పోసినా స్పందన కనబడలేదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలియచేసారు.